IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ బౌలర్లకు శుభవార్త చెప్పింది. సలైవాపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. ఐపీఎల్ జట్ల కెప్టెన్లతో బీసీసీఐ గురువారం సమావేశం నిర్వహించింది. ఇందులో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కొత్త రూల్స్ గురించి బీసీసీఐ కెప్టెన్లకు వివరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బంతిని మెరిసేందుకు సలైవా (ఉమ్మి)ని వాడడాన్ని ఐసీసీ నిషేధించింది. బీసీసీఐ సైతం ఐపీఎల్‌లోనూ నిషేధాన్ని అమలు చేసింది. ముంబయిలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో సలైవా ఉపయోగంపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందని ఓ ఉన్నత అధికారి చెప్పినట్లుగా ఓ నివేదిక తెలిపింది.
చాలామంది కెప్టెన్లు బ్యాన్ ఎత్తివేసేందుకు అనుకూలంగా ఉన్నారని.. ఐపీఎల్ మార్గదర్శకాలు ఐసీసీ అధికార పరిధికి మించినవని ఆ అధికారి పేర్కొన్నారు. కరోనాకు ముందు బంతికి షైన్ అయ్యేలా లాలాజలాన్ని ఉపయోగించడం సాధారణమైన విషయం. ప్రస్తుతం కరోనా ముప్పు ఏమీ లేదని.. నిషేధం ఎత్తివేసినా ఇబ్బంది లేదని ఆ అధికారి తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సహా పలువురు బౌలర్లు సలావై వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీని కోరారు. బంతి పాతబడిన సందర్భంలో బౌలర్లు సలైవాను ఉపయోగించి బంతిని మెరిసేలా చేసి.. రివర్స్ స్వింగ్‌ను రాబడుతుంటారు. అలాగే, కొత్తగా ఐపీఎల్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత రెండోబాల్ను ఇవ్వనున్నది. రాత్రిపూట జరిగే ఈ మ్యాచ్‌పై పడే మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ రూల్‌ని తీసుకువచ్చింది.
అయితే, బంతి మార్పుపై అంపైర్ల నిర్ణయానికే వదిలివేసింది. బంతిని మారుస్తారా? లేదా? అన్నది అంపైర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంచు ప్రభావం ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రూల్ రాత్రి మ్యాచులకు మాత్రమే వర్తించనున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనున్నది. మెగా టోర్నీలో పది జట్లు పాల్గొంటాయి. 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచులు జరుగనున్నాయి. ఇందులో 70 లీగ్ మ్యాచులు, మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2, ఫైనల్‌కు కోల్‌కతా వేదిక కానున్నది. మే 25న ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది.