ఐపీఎల్-17లో అంచనాలకు మించి రాణిస్తున్న మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరోసారి సమిష్టి ఆటతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల సునామీతో లక్నో బౌలర్లపై విరుచుకుపడి ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశాడు. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి కట్టడిచేయడంతో లక్నోకు మరో పరాభవం ఎదరురైంది. 8వ విజయంతో 16 పాయింట్లు సాధించిన కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
IPL | లక్నో: కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి సమిష్టి ప్రదర్శనతో రాణించి ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 98 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ సీజన్లో ఓపెనర్‌గా వస్తూ శివాలెత్తుతున్న సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారానికి తోడు మిగిలిన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో లక్నో ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. స్టోయినిస్ (21 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. హర్షిత్ (3/24), చక్రవర్తి (3/30), రస్సెల్ (2/17) లక్నోను కట్టడిచేశారు. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నరైన్.. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 22 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
నరైన్ బాదుడే బాదుడు..
కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో బాదుడుకు తెరతీశాడు. నవీన్ ఉల్ హక్ మూడో ఓవర్లో రెండు బౌండరీలతో హిట్టింగ్‌కు దిగిన నరైన్.. మోహ్సిన్ మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు, ఓ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. సాల్ట్ ఔట్ అయినా నరైన్ విధ్వంసం ఆగలేదు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన అతడు స్టోయినిస్ 11వ ఓవర్లో మూడు సిక్సర్లతో కేకేఆర్ స్కోరు వేగాన్ని పెంచాడు. అంగ్క్రిష్ రఘువంశీ (32)తో కలిసి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. ధాటిగా ఆడే క్రమంలో అతడు ఔట్ అయినా ఆఖర్లో శ్రేయస్ (23), రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) దంచడంతో కోల్‌కతా మరోసారి భారీ స్కోరుచేసింది.
లక్నో టపటప..
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (9) వికెట్‌ను కోల్పోయిన లక్నోను కెఎల్ రాహుల్ (25), మార్కస్ స్టోయినిస్ నిలబెట్టే యత్నం చేశారు. కానీ హర్షిత్ రాణా 8వ ఓవర్లో రాహుల్ ఔట్ కాగా స్టోయినిస్‌ను రస్సెల్ పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), బదోని (15), టర్నర్ (16), కృనాల్ (5) విఫలమయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లలో 235/6 (నరైన్ 81, సాల్ట్ 32, నవీన్ 3/49, యుధ్వీర్ 1/24). లక్నో: 16.1 ఓవర్లలో 137 (స్టోయినిస్ 36, రాహుల్ 25, హర్షిత్ 3/24, చక్రవర్తి 3/30)