IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 ప్రారంభానికి మూడు వారాల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేసిన ‘న్యూరోల్’ సస్పెన్స్ వీడిపోయింది..! రెండ్రోజుల క్రితమే ధోని తన ఎఫ్బీలో స్పందిస్తూ.. ‘కొత్త సీజన్లో కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి..’ అని పోస్ట్ చేయడంతో ‘తాలా’ కెప్టెన్సీ వదిలేయబోతున్నాడని, సీఎస్కేకు మెంటార్ కమ్ ప్లేయర్‌గా ఉండనున్నాడని వాదనలు వినిపించాయి. అయితే ధోని మాత్రం ఓ యాడ్ కోసమే ఇంత సస్పెన్స్ క్రియేట్ చేశాడని తేలిపోయింది. యాడ్‌లో ‘డ్యూయల్ రోల్’ పోషించిన చెన్నై కెప్టెన్.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ (మొబైల్) హక్కులు కలిగిన జియో యాడ్ కోసమే ఈ ‘న్యూ రోల్’ పోస్టును పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
జియో సినిమా ట్విటర్ (ఎక్స్) వేదికగా విడుదల చేసిన ఈ యాడ్‌లో ధోని తండ్రీకొడుకులుగా నటించాడు. ఓ ఇంట్లో ధోని (కొడుకుగా) సోఫాలో కూర్చుని మొబైల్లో ఐపీఎల్ చూస్తుండగా లోపలి నుంచి తండ్రి క్యారెక్టర్లో ఉన్న ధోని వచ్చి (అతడు కూడా మొబైల్లో ఐపీఎల్ చూస్తూనే).. ‘బేటా.. గుండెల్లో నొప్పిగా ఉంది..’ అంటాడు. అప్పుడు కొడుకు పాత్ర పోషించిన ధోని ఫోన్లో మ్యాచ్ చూసుకుంటూనే.. ‘అవునా.. అయితే హాస్పిటల్‌కు పోదాం పదా..’ అని బదులిస్తాడు. ఈ ఇద్దరితో పాటు అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి కూడా చేతిలో ఉన్న మొబైల్లో ఐపీఎల్ చూస్తూనే కనిపించాడు. చివర్లో ‘అందరూ ఇక్కడే ఉన్నారు.. మరెక్కడికో ఎందుకు..?’ అంటూ క్యాప్షన్‌తో యాడ్ ముగుస్తుంది.
Thala bhi, unke Dadaji bhi
Cricket ke stans bhi
Cricketers ke fans bhi
JioCinema pe TATA IPL sab dekhenge
Kahin bhi, kaise bhi!#SabYahaanAurKahaan#IPLonJioCinema, streaming FREE from March 22!#IPL2024 #TATAIPL pic.twitter.com/Su1SWlmRcD— JioCinema (@JioCinema) March 6, 2024
నేడు మధ్యాహ్నం జియో ఈ యాడ్‌ను రిలీజ్ చేయగా ఇది చూసిన ధోని అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ధోని సస్పెన్స్ పోస్టులు పెట్టాడంటే అది ఏదో టీవీ యాడ్‌కు సంబంధించిందిగా ఉంటుందన్న అనుమానం ముందే వచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో 2022 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కూడా ధోని ఇదే సస్పెన్స్ క్రియేట్ చేసి ఆఖరికి ‘ఓరియో’ యాడ్‌ను ప్రమోట్ చేసిన విషయం విదితమే. తాజాగా చేసిన న్యూ రోల్ పోస్ట్ కూడా అదే విధంగా ఉందని పెదవి విరుస్తున్నారు.
2023లో ఐపీఎల్ మొబైల్ ప్రసారాలను దక్కించుకున్న జియో.. గతేడాది మాదిరిగానే ఈ సీజన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్.. ఇప్పటికే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో యాడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభానికి టైమ్ దగ్గరపడుతుండటంతో జియో కూడా ధోనితో యాడ్‌ను రిలీజ్ చేసింది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై వేదికగా తొలిమ్యాచ్‌లో తలపడనుంది.