గువాహటి: ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు రాబట్టింది. ప్రత్యర్థి జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్‌కు 198 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా రాజస్థాన్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 60 (34 బంతుల్లో, 3 సిక్స్‌లు, 7 ఫోర్లు) సిక్సర్లు, ఫోర్లు దంచి కొట్టాడు. మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ 86 (56 బంతుల్లో, 3 సిక్స్‌లు, 9 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఆసిఫ్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకోగా, చాహల్ 50 పరుగులు ఇచ్చాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు. అసోం రాజధాని గువాహటిలోని బర్సపారా స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.