టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడు సూర్యకుమార్ యాదవ్.. ఈ సారి ముంబై ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా గాయపడిన సూర్య.. శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు.
బొటనవేలి గాయంతో ఎన్సీఏలో ఉన్న అతను.. కోలుకుంటున్నాడని, కానీ ముందు జాగ్రత్త చర్యగా ముంబై ఇండియన్స్ ఆడే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. ముంబై ఇండియన్స్ జట్టు రీటెయిన్ చేసుకున్న ఆటగాళ్లలో సూర్య ఒకడు.
జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత అంత కీలకమైన ఆటగాడు అతనే అనడం అతిశయోక్తి కాదు. ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో రెండో మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో సూర్యకు విశ్రాంతినిస్తే, రెండో మ్యాచ్‌కు అతను పూర్తి మ్యాచ్ ఫిట్‌గా తయారవుతాడని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వడం దాదాపు గ్యారంటీ అని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే జట్టు ఉన్న హోటల్‌కు చేరుకున్నారు. శ్రీలంకతో సిరీస్ తర్వాత బబుల్ టు బబుల్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్లు ఇక్కడకు చేరుకున్నారు. కాబట్టి మూడురోజుల క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం వీరికి ఉండదు.