IPL 2022 | ఐపీఎల్ రిటెన్షన్‌లో ఇంత భారీగా ఎవరి రేటూ పెరగలేదేమో?.. టాప్-5 వీళ్లే!
IPL 2022 | ఎవరికీ తెలియని క్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతే మరే టోర్నీ అయినా. ఈ టోర్నమెంట్లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు తలుపు

ఎవరికీ తెలియని క్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతే మరే టోర్నీ అయినా. ఈ టోర్నమెంట్లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు తలుపు తట్టిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.
ఈ రిటెన్షన్లలో భారీ మొత్తంలో ఆదాయం పొందిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అంతకుముందు సీజన్‌తో పోల్చుకుంటే తమ జీతాలు ఒక రేంజ్లో పెంచుకున్న ఆటగాళ్ల వివరాలు ఒకసారి చూద్దామా..? ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే.. వీరిలో కొందరు ఇప్పటికీ జాతీయ జట్టుకు కనీసం ఎంపిక కూడా కాలేదు!
మయాంక్ అగర్వాల్
2018 మెగా వేలంలో రూ.కోటి రూపాయలు చెల్లించి, మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అప్పట్లో ఈ ఫ్రాంచైజీ పేరు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌గా ఉండేదనే విషయం తెలుసు కదా. అప్పటి నుంచి ఈ జట్టు తరఫున మయాంక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ తర్వాత ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసింది కూడా అతనే. దీంతో ఈ కర్ణాటక ఆటగాడిపై ఎంతో నమ్మకాన్ని పెంచుకుంది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం.

అందుకే ఈసారి ఏకంగా రూ.12 కోట్లు చెల్లించి మరీ అతన్ని రిటైన్ చేసుకుంది. అంటే అతని జీతం ఏకంగా 12 రెట్లు పెరిగిందన్నమాట. ఇప్పటి వరకూ 100 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 2135 పరుగులు చేశాడు. దీనిలో 11 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఈ ఫ్రాంచైజీ నుంచి వెళ్లిపోవడంతో ఆ జట్టు పగ్గాలు మయాంక్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అర్షదీప్ సింగ్
మరో పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాడు. 22 ఏళ్ల వయసులోనే అద్భుతమైన పేసర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించాడీ కుర్రాడు. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి తన సూపర్ బౌలింగ్‌తో క్రికెట్ పండితులను కూడా మెప్పించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యుత్తమ ఫినిషర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టగలిగే ట్యాలెంట్ అర్షదీప్ సొంతం.

అప్పట్లో అతన్ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్.. ఈసారి రూ.4 కోట్లు పెట్టి అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ 30 వికెట్లు కూల్చాడు. అతని యావరేజ్ 22.3, స్ట్రైక్ రేట్ 15.23 మాత్రమే కావడం గమనార్హం. అర్షదీప్ శాలరీ హైక్ ఏకంగా 2000 శాతం!
అబ్దుల్ సమద్
జమ్మూకశ్మీర్‌కు చెందిన ఈ ఆటగాడి పేరు ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ క్రికెట్ పండితులు మాత్రం అబ్దుల్ చాలా ట్యాలెంటెడ్ అని మెచ్చుకుంటారు. హార్డ్ హిట్టర్‌గా దేశవాళీల్లో రాణించిన సమద్.. లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ ఆడిన అతను సాధించింది తక్కువే. కానీ అతని సత్తా తక్కువేం కాదు.

సరిగ్గా మార్గనిర్దేశం చేస్తే అద్భుతమైన ఆటగాడిగా మారతాడు. అందుకే అతన్ని వదులుకోవడానికి సన్‌రైజర్స్ మనసొప్పలేదు. ఏకంగా రూ.4 కోట్లు చెల్లించి అతన్ని రిటైన్ చేసుకుంది. గతంలో అతని రేటు రూ.20 లక్షలే. అంటే సుమారు 20 రెట్లు పెరిగిందన్నమాట.
రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్2021లో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న యువ ట్యాలెంట్ రుతురాజ్ గైక్వాడ్. చెన్నై తరఫున అద్భుతమైన ఫామ్ కనబరిచిన గైక్వాడ్.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్లో సెంచరీ కూడా చేసిన అతను తన ఐపీఎల్ కెరీర్లో ఆడింది 22 మ్యాచులే. కానీ సెంచరీ సహా 839 పరుగులు చేశాడు. గైక్వాడ్ యావరేజ్ ఏకంగా 46.61 కాగా, స్ట్రైక్ రేట్ కూడా 132.13గా ఉంది.

గత ఐపీఎల్ సీజన్లో ఏకంగా ఏడు అర్ధశతకాలు, ఒక సెంచరీ బాదాడు. అందుకే అతనిపై చెన్నై ఫ్రాంచైజీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. గత సీజన్లో బేస్‌ప్రైజ్ రూ.20 లక్షలకు అతన్ని దక్కించుకున్న చెన్నై.. ఈసారి ఏకంగా రూ.6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో అతని విలువ ఏకంగా 30 రెట్లు పెరగడం గమనార్హం.
వెంకటేశ్ అయ్యర్
ఐపీఎల్2021 రెండో దశలో అద్భుతంగా రాణించి, కోల్‌కతా జట్టు ఫైనల్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో వెంకటేశ్ అయ్యర్ ఒకడు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్‌రౌండర్ అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 రెండో దశలో అతను చాలా మందిని ఇంప్రెస్ చేశాడు. ఎంతలా అంటే ఇటీవల జరిగిన న్యూజిల్యాండ్ టీ20 సిరీస్ కోసం టీమిండియా పిలుపు అందుకునేంతలా.

అతని సత్తాను గుర్తించిన కేకేఆర్ యాజమాన్యం.. శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ వంటి యువ ఆటగాళ్లను పక్కనపెట్టి అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. దీనికోసం ఏకంగా రూ.8 కోట్లు వెచ్చించింది. ఈ 26 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆడింది కేవలం పది ఐపీఎల్ మ్యాచులే. వీటిలోనే 128.47 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 370 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 41.11గా ఉంది. ఇప్పుడిప్పుడే లైమ్‌లైట్‌లోకి వస్తున్న అయ్యర్‌లో ట్యాలెంట్‌కు కొదవలేదు. అందుకే గతంలోకంటే 40 రెట్లు ఎక్కువ ఖర్చుపెట్టి మరీ అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

