IPL 2022 | ఐపీఎల్లో భాగంగా ముంబై వేదికగా బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై బెంగళూరు విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఆడిన కోల్‌కతాను మూడు వికెట్ల తేడాతో ఓడించి.. బోణీ కొట్టింది.
129 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరు ప్లేయర్లకు ఆరంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ తమ బౌలింగ్‌తో టాప్ ఆర్డర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 17 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు ( అనుజ్ రావత్, డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ) కోల్పోయింది. వరుస వికెట్లు పడిపోవడంతో కష్టాల్లో పడిపోయిన ఆర్బీబీని.. డేవిడ్ విల్లె, రూథర్‌ఫర్డ్ 45 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఇంతలో డేవిడ్ విల్లె ఔటవ్వడంతో వీరి దూకుడుకు బ్రేక్ పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్ అహ్మద్ వరుసగా రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. కానీ 101 పరుగులకే షాబాజ్ ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఆరు పరుగులకే రూథర్‌ఫర్డ్ రూపంలో ఐదో వికెట్ కూడా కోల్పోవడంతో ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది. కానీ చివర్లో హర్షల్ పటేల్ (10), దినేశ్ కార్తిక్ ( 14) అద్భుతంగా ఆడి బెంగళూరుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా ఆటగాళ్లు పరుగులు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ (10), అజింక్యా రహానె (9), నితీశ్ రాణా (10) రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ (13), సునీల్ నరైన్ (12), షెల్డన్ జాక్సన్(0) సహా ఎవ్వరూ ప్రభావం చూపించలేకపోయారు. ఆండ్రూ రస్సెల్ (25) ఒక్కడే అందరిలో కాస్త మెరుగ్గా ఆడాడు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగియకముందే 128 పరుగుల వద్ద ఆలౌటైంది.