టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన్సీ చేయడం లేదని ప్రకటించాడు. తను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానంటూ షాకింగ్ ప్రకటన చేశాడు.
అదే సమయంలో తర్వాతి కెప్టెన్గా సూపర్ ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజాను ఎంపిక చేసినట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. 2012లో చెన్నైతో చేరిన జడ్డూ.. ఈ జట్టు సస్పెండ్ అయిన 2016, 2017 సంవత్సరాల్లో మాత్రమే వేరే ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. మిగతా అన్ని సీజన్లలో చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. తాజా నియామకంతో చెన్నై జట్టకు నాయకత్వం వహించబోతున్న మూడో వ్యక్తిగా జడ్డూ నిలిచాడు. మెగా వేలానికి ముందు జడ్డూని రూ.16 కోట్లు పెట్టి చెన్నై జట్టు రీటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో ధోనీ కాకుండా సురేష్ రైనా మాత్రమే ఈ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ షురూ అయినప్పటి నుంచి చెన్నై జట్టుకు కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. తొలిసారి ఈ సీజన్లో కేవలం ఆటగాడిగానే పాల్గొనబోతున్నాడు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిస్టర్ కూల్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022