బెంగళూరు: ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ తాజా ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. దాంతో ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ మధ్యాహ్నం వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను రూ.14 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నది.
కాగా, వైట్ బాల్ ఫార్మాట్లలో నమ్మకమైన బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు దక్కించుకున్న
దీపక్ చాహర్ గత నాలుగేండ్లుగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తరఫునే ఆడుతున్నాడు. 2018 నుంచి ఇప్పటివరకు సీఎస్కే తరఫున 63 మ్యాచ్‌లు ఆడిన చాహర్ మొత్తం 59 వికెట్లు తీశాడు. భారత్ తరఫున టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన చాహర్.. వన్డేల్లో రెండు అర్దసెంచరీలు కూడా చేశాడు.
అయితే, ఎర్రబంతి ఫార్మాట్లో చాహర్‌కు అవకాశం రావాల్సి ఉంది. క్లాసికల్ స్వింగ్ బౌలర్ అయిన దీపక్ చాహర్ బ్యాటుతోనూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించగలడు. సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాలుగేండ్ల నుంచి చాహర్‌ను తెలివిగా ఉపయోగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలో మూడు ఓవర్లను కచ్చితంగా చాహర్‌తో వేయిస్తూ వస్తున్నాడు.
ఇక, గత సీజన్లో కోల్‌కతా జట్టుతో మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. అనంతరం ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ఆ పోస్టుకు స్పెషల్ మూవ్ మెంట్ అనే క్యాప్షన్‌ను యాడ్ చేశాడు.