మహాభారతంలో పాండవుల వనవాసం 12 ఏండ్లు. రామాయణంలో రాముడి అరణ్యవాసం 14 ఏండ్లు.. కానీ ఆధునిక భారతంలో అదీ క్రికెట్‌ను ఓ మతంగా పరిగణిస్తూ క్రికెటర్లను దైవ సమానులుగా కొలిచే ఆటలో రెండు జట్ల వీరాభిమానులు తమ అభిమాన ఫ్రాంచైజీ ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని 18 ఏండ్లుగా కండ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. ఆ కరువును తీర్చడానికా అన్నట్టుగా ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) నేడు తమ ప్రయాణంలో తుది మెట్టుపై నిలిచాయి. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే ఫైనల్లో ఈ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త చాంపియన్ అవతరించనట్టే!
అహ్మదాబాద్: రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు షడ్రుచోపేతమైన విందును అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ఈ లీగ్ ఆవిర్భావం (2008) నుంచీ బరిలో నిలిచి టైటిల్‌ను ముద్దాడే క్షణం కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాయి. సీజన్ ఆసాంతం స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్ చేరిన ఈ ఇరుజట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్-18 ఫైనల్ జరుగబోతున్నది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ టైటిల్ నెగ్గని ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే కాబోతున్నది.
బలాబలాలు:
జట్టు పరంగా బెంగళూరు గానీ, పంజాబ్ గానీ సమఉజ్జీలే. ఈ సీజన్‌కు ముందే కొత్త సారథులను నియమించుకుని తిరుగులేని ఆటతో ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి పటిష్ట జట్లకు చుక్కలు చూపించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఈ రెండు జట్లు.. ఈ సీజన్లో తలపడనుండటం ఇది నాలుగోసారి. లీగ్ దశలో విజయం తలా ఒకసారి పలుకరించగా గత నెల 29న ముల్లాన్‌పూర్‌లో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో మాత్రం బెంగళూరుదే పైచేయి అయింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్.. రెండో క్వాలిఫయర్‌లో ఐదు సార్లు చాంపియన్ ముంబైని ఇంటికి పంపించి ఆర్సీబీతో బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది.
బెంగళూరుకు బ్యాటింగ్‌లో కోహ్లీ, సాల్ట్, కెప్టెన్ పటీదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టొన్ వంటి దుర్బేధ్యమైన లైనప్ ఉంది. ఈ సీజన్లో కోహ్లీ 14 ఇన్నింగ్స్‌లో 55.82 సగటుతో 614 పరుగులు చేశాడు. సాల్ట్, పటీదార్, జితేశ్ కూడా టచ్‌లోనే ఉన్నారు. బెంగళూరు బౌలింగ్‌కు హాజిల్‌వుడ్ వెన్నెముక కాగా వెటరన్ భువనేశ్వర్, లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ వంటి సీమర్లు, కృనాల్, సుయాశ్ వంటి స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. హాజిల్‌వుడ్ 11 మ్యాచ్‌లలో 21 వికెట్లతో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ ఓటమిని శాసించిన సుయాశ్.. మరోసారి సత్తాచాటాలని ఆర్సీబీ ఆశిస్తున్నది.
బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో పంజాబ్ కూడా తక్కువ తిన్లేదు. అన్క్యాప్డ్ అరవీర భయంకరులు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌తో పాటు కెప్టెన్ శ్రేయాస్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నెహల్ వధెరతో ఆ జట్టూ పటిష్టంగానే ఉంది. 18వ సీజన్లో శ్రేయాస్.. 16 మ్యాచ్‌లలో 603 రన్స్ చేయగా ప్రభ్‌సిమ్రన్ (523), ప్రియాన్ష్ (451) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాలిస్తున్నారు. కింగ్స్ బౌలింగ్ దళాన్ని అర్ష్‌దీప్ (18 వికెట్లు) నడిపిస్తుండగా జెమీసన్, స్టోయినిస్, విజయ్‌కుమార్ వంటి పేసర్లు, చాహల్, హర్‌ప్రీత్ బ్రర్ వంటి స్పిన్నర్లు మ్యాచ్‌ను ఏ నిమిషంలో అయినా మలుపు తిప్పగల సమర్థులు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఫైనల్ రసవత్తరంగా జరుగనుండటం ఖాయం పిచ్: అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపే అవకాశముంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలు ఛేదన చేసే జట్టుకు అనుకూలంగా మారుతున్నాయి. వర్షం వల్ల మ్యాచ్ సాగకుంటే ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది.
ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు సారథిగా ఉండి మూడింటినీ ఫైనల్ చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్ శ్రేయాస్. అతడు 2020లో ఢిల్లీని, 2024లో కోల్‌కతాను 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
పంజాబ్‌కు ఇది రెండో ఫైనల్. 2014లో ఆ జట్టు తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించినా ఆ సీజన్లో కోల్‌కతా చేతిలో ఓడింది.