బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు పసందైన విందు అందించింది. సోమవారం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో హోరాహోరీగా సాగిన పోరులో యూపీ వారియర్స్(సూపర్ ఓవర్)నే విజయం వరించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఆరు బంతుల్లో హెన్రీ(4) వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. గారెత్‌కు వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్సీబీ 4 పరుగులకే పరిమితమై ఓటమి కొనితెచ్చుకుంది. బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న ఎకల్‌స్టోన్..కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లు మందన, రిచాఘోష్ను నిలువరించింది. మొత్తంగా యూపీ విజయంలో ఎకల్‌స్టోన్ కీలకంగా వ్యవహరించింది. అంతకుముందు ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ 20 ఓవర్లలో 180 స్కోరు చేసింది. ఎకల్‌స్టోన్(33), శ్వేతా సెహ్రావత్(31), కెప్టెన్ దీప్తిశర్మ(25) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్నేహ్‌రానా(3/27), రేణుకా సింగ్(2/36), కిమ్ గారెత్(2/40) రాణించారు. తొలుత ఎలీస్ ఎర్రీ(56 బంతుల్లో 90 నాటౌట్, 9ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. డానీ వ్యాట్(57) ఆకట్టుకుంది. హెన్రీ, దీప్తి, మెక్‌గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు.