న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘం(బీఎఫ్ఐ)లో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సందిగ్ధతకు తెరదించుతూ భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష..కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీఎఫ్ఐ తాత్కాలిక ప్యానెల్ ఆదివారం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఆగస్టు31లోగా ఎన్నికలు పూర్తయ్యే అవకాశముందని తెలిపింది.
ముగ్గురితో సభ్యులతో కూడిన ఐవోఏ కమిటీకి కోశాధికారి సహదేవ్ యాదవ్ అధ్యక్షతన వహించనుండగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు భూపేందర్‌సింగ్ భాజ్వా, అడ్వకేట్ట పాయాల్ కాక్రా సభ్యులుగా ఉన్నారు. ‘ప్రస్తుత బీఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ గడువు ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసినా..అప్పటి నుంచి ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఐవోఏ నియమించిన కమిటీ దేశం లో బాక్సింగ్ కార్యకలాపాలు, నిర్వహణపై దృష్టి సారించనుంది. దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్‌తో సం బంధాలతో తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు, ఎన్నికలను సరైన పద్ధతిలో నిర్వహించేందుకు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనుంది. దీనికి సంబంధించి వారం రోజుల్లో ఐవోఏకు నివేదిక సమర్పించాల్సి ఉంది’ అని ఐవోఏ వర్గాలు తెలిపాయి.