దుబాయ్: ఆసియాకప్ ఫైనల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేసే సమయంలో ఒకరు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆనవాయితీ. కానీ దాయాదుల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఇద్దరు వ్యాఖ్యాతలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్తో భారత్కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా, పాక్ సారథి సల్మాన్ఆగాతో వకార్ యూనిస్ సంభాషించడం కనిపించింది. అయితే దీని వెనుక పెద్ద తతంగమే జరిగినట్లు తెలిసింది. గత రెండు మ్యాచ్లకు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి వద్దంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)..ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఏసీసీ.. బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లగా రవిశాస్త్రిని తప్చించేందుకు బోర్డు ససేమిరా అంది. దీంతో మధ్యేమార్గంగా నిర్వాహకులు ఇద్దరు వ్యాఖ్యాతలతో టాస్ కానిచ్చేశారు. ఇదిలా ఉంటే ఫైనల్కు ముందు కెప్టెన్ల ట్రోఫీ ఫొటో షూటౌట్ గురించి తమకు చెప్పలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.