Asia Cup | దుబాయి వేదికగా ఆసియాకప్ మొదలైంది. టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడకముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా గాయపడ్డాడు. సల్మాన్ మెడ కండరాలతో బాధపడుతున్నాడని.. దాంతో నెక్ బ్రేస్ ధరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాంతో సల్మాన్ ప్రాక్టీస్ సెషన్లకు దూరంగా ఉన్నాడు. సల్మాన్ గాయంతో పాక్ టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆదివారం భారత్‌తో హై వోల్టోజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో అఘా ఆడుతాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
అయితే, పాకిస్తాన్ బోర్డు గాయం తీవ్రమైందేమీ కాదని.. కేవలం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. గాయం చిన్నదేనని.. త్వరలోనే పూర్తి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాడని చెప్పారు. కీలక మ్యాచ్‌ల వరకు కెప్టెన్ ఫిట్ అవుతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. సల్మాన్ అఘా ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని యువ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణ తర్వాత.. జట్టు బాధ్యతలను సల్మాన్‌కు అప్పగించారు. కోచ్ మైక్ హెస్సన్ నాయకత్వంలో జట్టు కోలుకుంటుంది.
సల్మాన్‌తో పాటు ఫఖర్ జమాన్ జట్టుల్లో సీనియర్ బ్యాట్స్‌మెన్. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో సల్మాన్ మాట్లాడుతూ.. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని.. టీమ్ జట్టుగా ప్రదర్శని ఇస్తోందని తెలిపాడు. ఆసియా కప్ కోసం ఆటగాళ్లు అందరూ ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. ఆసియా కప్‌లో భారత్ ఫేవరెట్ జట్టేనా? అని ప్రశ్నించగా.. టీ20 క్రికెట్లో ఏ జట్టు ఫేవరెట్ కాదని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఒకటి రెండు ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్ని మార్చవచ్చని పేర్కొన్నాడు. అయితే, ఆసియా కప్‌కు ముందు యూఏఈలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను 75 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఆసియా కప్‌లో పాకిస్తాన్ గ్రూప్ దశలో భారత్, యూఏఈ, ఒమన్‌లతో తలపడనున్నది.