INDvsSA 2nd Test: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా చివరి మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు.. కేప్‌టౌన్ టెస్టులో సఫారీలకు ఊహించని షాకివ్వడమే గాక తానేం తక్కువ కాదని వికెట్లను సమర్పించుకుంది. న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో బౌలర్లు తొలి రోజే 23 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 27 మంది బ్యాటర్లు తొలి రోజు బ్యాటింగ్‌కు రాగా ఇందులో ఒక్కరు కూడా అర్థ సెంచరీ చేయలేదు. ఇది ఓ రికార్డు. కేప్‌టౌన్ టెస్టులో ఇలాంటి రికార్డులు కోకొల్లలుగా నమోదయ్యాయి.
రెండో టెస్టు తొలి రోజే బౌలర్ల విజృంభణతో 23 వికెట్లు నేలకూలాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్కరోజే ఇన్ని వికెట్లు పడటం ఇది ఐదో సారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా (1888, 27 వికెట్లు), ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ (1902, 25 వికెట్లు) , ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా (2018, 24 వికెట్లు), ఇండియా – ఆఫ్గానిస్తాన్ (2018, 24 వికెట్లు) జట్టు ఆడిన మ్యాచ్‌లు ఈ జాబితాలో ముందున్నాయి. అయితే టెస్టు తొలి రోజులో ఇన్ని వికెట్లు కోల్పోవడం మాత్రం ఇది రెండోసారే. 1902లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆట మొదటిరోజే 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత నిన్న సౌతాఫ్రికా – భారత్ మ్యాచ్‌లో 23 వికెట్లు కోల్పోవడం గమనార్హం.
ఇక దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టులలో భాగంగా తొలి రోజు ఇన్ని వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. అంతకుముందు గబేరా వేదికగా సౌతాఫ్రికా ఇంగ్లండ్ మధ్య 1896లో జరిగిన టెస్టులో తొలి రోజే ఇరు జట్లూ 21 వికెట్లు కోల్పోయాయి. కానీ 2011లో సౌతాఫ్రికా – ఆసీస్ మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆట రెండో రోజు 23 వికెట్లు నేలకూలాయి.
Stumps on Day 1.
23 wickets, one hell of a Day, incredible action with domination with the ball. pic.twitter.com/LoYTfD4Hh5
— Johns. (@CricCrazyJohns) January 3, 2024
టెస్టులలో ఈ శతాబ్దంలో ఇది (55) రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు వెస్టిండీస్.. 2003-04లో కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులకు ఆలౌట్ అయింది. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్లో నిషేధం నుంచి బయటపడ్డాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు సఫారీల లోయెస్ట్ టోటల్ 2018లో శ్రీలంకలో గాలె వేదికగా జరిగిన టెస్టు (73)గా నమోదైంది.
మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి సెషన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్లలో సిరాజ్ రెండో బౌలర్‌గా నిలిచాడు. అంతకుమందు ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. 2015లో 8-15 గణాంకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత లోయరార్డర్ బ్యాటర్లు (ఆరుగురు) డకౌట్లతో వెనుదిరిగి ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతకుముందు టెస్టు క్రికెట్లో ఒక జట్టు మూడు పరుగుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోగా భారత్ మాత్రం.. ఆఖరి ఆరుగురు బ్యాటర్లు ఒక్క పరుగు చేయకుండానే ఇన్నింగ్స్ ముగించింది.