Arshdeep Singh: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాలో కొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసి సఫారీ జట్టు వెన్ను విరిచిన ఈ పంజాబ్ పేసర్.. వన్డే ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేలలో దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి పేసర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. అంతకుముందు పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో పది ఓవర్ల కోటా పూర్తిచేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
సఫారీ గడ్డపై వన్డేలలో ఆడుతూ ఐదు వికెట్లు తీసినవారిలో ఇప్పటివరకూ ఇద్దరే ఇద్దరు బౌలర్లు. వారిలో సునీల్ జోషి (1999లో.. 5/6), యుజ్వేంద్ర చాహల్ (2018లో.. 5/22)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. రవీంద్ర జడేజా కూడా సౌతాఫ్రికాపై ఐదు వికెట్లు తీసినా అది వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా కోల్‌కతాలో సాధించాడు. అయితే సౌతాఫ్రికా పై వాళ్ల దేశంలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేసర్ మాత్రం అర్ష్‌దీపే.
అంతకుముందు ఇషాంత్ శర్మ 2013లో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పది ఓవర్లు వేసి నాలుగు వికెట్లు (4/40) సాధించాడు. ఇప్పటిదాకా అదే రికార్డు. సఫారీ గడ్డపై ఇషాంత్, అర్ష్‌దీప్ తర్వాత అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన పేసర్ అవేశ్ ఖాన్. అవేశ్ ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు మెయిడిన్లు వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
HISTORIC.
– Arshdeep Singh becomes the first Indian pacer to five-wicket haul against SA in SA in ODIs. pic.twitter.com/ZCp03V7915
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
సౌతాఫ్రికా చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో 116 పరుగులు చేయడం ద్వారా సౌతాఫ్రికా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. భారత్‌పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ -2023 లో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 83 పరుగులకే ఆలౌట్ అయ్యారు. గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన ఓ వన్డేలో 99 రన్స్ మాత్రమే చేసిన సౌతాఫ్రికా.. తాజాగా 116 పరుగులకే ఆలౌట్ అయింది. స్వదేశంలో కూడా ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు రెండు పర్యాయాలు నైరోబి (1999), సెంచూరియన్ (2018) లలో సఫారీలు వరుసగా 117, 118 పరుగులు మాత్రమే చేశారు. వన్డేలలో సౌతాఫ్రికా అత్యల్ప స్కోరు 69గా ఉంది. 1993లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 28 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.