Venezuela | వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు తూటాల శబ్దాలు మార్మోగాయని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో పలు డ్రోన్లు, విమానాల శబ్దాలు కూడా వినిపించాయని పేర్కొన్నారు. ఈ పరిణామం నేపత్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.
గుర్తు తెలియని డ్రోన్లు అధ్యక్ష భవనం పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించి అప్రమత్తమయ్యాని.. ఈ క్రమంలోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా వెనెజువెలా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే పరిస్థితిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగిందా అనే విషయాలపై ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కారకస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా వైట్ హౌస్ స్పందించింది. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. కాగా, అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహించే పారామిలటరీ బలగాల మధ్య మిస్ అండర్స్టాండింగ్ వల్లనే ఈ కాల్పులు జరిగాయని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది.
BREAKING: Small arms or anti-aircraft fire heard in Caracas, Venezuela pic.twitter.com/rBNRrNfN4l
— BNO News Live (@BNODesk) January 6, 2026