Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దర్శకుడు మారుతి హారర్ ఫాంటసీ జానర్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండటంతో ప్రచార కార్యక్రమాలు వేగం పెంచాయి. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’, ‘సహనా సహనా’ పాటలు, ‘రాజే యువరాజే’ మ్యూజిక్ బిట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన మరో స్పెషల్ సాంగ్ చర్చనీయాంశంగా మారింది.సోమవారం ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ‘నాచే నాచే’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట 1982లో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని సూపర్ హిట్ నంబర్ ‘ఆవా ఆవా కోయి యహాన్ నాచే’కు ఆధునిక రీమిక్స్‌గా రూపొందింది.
అప్పట్లో బప్పీ లహరి అందించిన ఒరిజినల్ ట్యూన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అదే పాటను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ ఈ పాటకు ఎనర్జిటిక్ బీట్ ఇచ్చారు. నకాష్ అజీజ్, బృందా కలిసి ఈ పాటను ఆలపించారు. ‘నాచే నాచే’ పాటలో ప్రభాస్ తన స్టైలిష్ స్వాగ్తో పాటు డ్యాన్స్‌లోనూ కొత్త కోణాన్ని చూపించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురూ గ్లామర్‌తో పాటు స్టెప్పుల విషయంలోనూ పోటీపడుతూ కనిపించారు. ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు కనిపించడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. గ్రీస్‌లోని అందమైన లొకేషన్లలో భారీ స్థాయిలో షూట్ చేయడంతో పాట విజువల్స్ గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. కొత్త తరహా కాస్ట్యూమ్స్, స్టైలింగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటను హిందీ, తమిళ్ భాషల్లో విడుదల చేయగా, తెలుగు వెర్షన్‌ను ప్రత్యేకంగా రిలీజ్ చేయడం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లలో హిందీ వెర్షన్లోనే ఈ పాటను చూడనున్నారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మరోవైపు ఈ పాటని ఎండ్ క్రెడిట్ నెంబర్‌గా వాడబోతున్నారంటూ చర్చ నడుస్తున్న క్రమంలో దర్శకుడు మారుతి వాటికి చెక్ పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ది రాజా సాబ్‌ను ఇండియాలోనే అతిపెద్ద హారర్ ఫాంటసీ మూవీగా ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. యూఎస్ ప్రీమియర్లు ఒక రోజు ముందుగానే ప్లాన్ చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ 2.0 సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సంక్రాంతి రేసులో ప్రభాస్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.