Mohammed Shami: వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీఫైనల్లో కేన్ విలియమ్సన్ వికెట్ తీయడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.
షమీ 17 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకుని ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రపంచకప్‌లో స్టార్క్.. 19 ఇన్నింగ్స్‌లలోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జాబితాలో లంక మాజీ పేసర్ లసిత్ మలింగ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. 28 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు.
ఇన్నింగ్స్పరంగానే కాక బంతులపరంగా చూసినా షమీనే ముందున్నాడు. 50 వికెట్లు పడగొట్టడానికి షమీ 795 బంతులు విసరగా స్టార్క్ 941 బంతులు వేశాడు. అంతేగాక భారత్ నుంచి వన్డే వరల్డ్ కప్‌లో 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా కూడా షమీ రికార్డులకెక్కాడు. భారత్ నుంచి జహీర్ ఖాన్.. 23 ఇన్నింగ్స్‌లలో 44 వికెట్లు పడగొట్టడమే ఇప్పటివరకూ రికార్డు..
5️⃣0️⃣ CWC Wickets & counting ⚡⚡
Spectacular Shami 👏👏
Follow the match ▶️ https://t.co/yh8963Yhn3…#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EU1YJ61L7a
— BCCI (@BCCI) November 15, 2023
వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసినవారిలో ఆసీస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అందరికంటే ముందున్నాడు. మెక్‌గ్రాత్.. 39 ఇన్నింగ్స్‌లలో 71 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మురళీధరన్ (68), మిచెల్ స్టార్క్ (59), మలింగ (56), వసీం అక్రమ్ (56), ట్రెంట్ బౌల్ట్ (55)లు షమీ కంటే ముందున్నారు. కివీస్‌తో మ్యాచ్‌లో టామ్ లాథమ్ వికెట్ షమీకి 51వది కావడం విశేషం.