INDvsAUS: వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరుగబోయే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తమ అభిమాన ఆటగాళ్ల ఆట చూసేందుకు సుమారు లక్షా ఇరవై వేల మంది మోతేరాలో మోతెక్కించనున్నట్టు సమాచారం. వీరిలో దాదాపు అందరూ భారత జట్టుకు సపోర్ట్ చేయబోయే అభిమానులేనన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. టీమిండియాలో ఆడేది పదకొండు మందే అయినా అభిమానుల మద్దతు రోహిత్ సేనకు కొండంత బలాన్ని అందించనుంది. అయితే స్టేడియంలో ప్రేక్షకుల నోళ్లు మూయించడానికి తమ వద్ద సూపర్ ప్లాన్ ఉందంటున్నాడు ఆసీస్ సారథి పాట్ కమిన్స్.
వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిన్స్ మాట్లాడుతూ..‘రేపు స్టేడియంలో క్రౌడ్ అంతా వన్ సైడెడ్ ఉండనుంది. అందులో మాకు క్లారిటీ ఉంది. అయితే ఏ క్రీడలో అయినా తమ దేశానికి మద్దతుగా అభిమానుల అరుపులను నిశ్శబ్దంలోకి నెట్టగలిగితే దానంత ఆనందం మరోటి ఉండదు. రేపు మా లక్ష్యం కూడా అదే.. ఆ మేరకు మేం మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం..’ అని కమిన్స్ హెచ్చరించాడు.
కమిన్స్ వ్యాఖ్యలను బట్టి చూస్తే లీగ్ దశలో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు ఆరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటానికి భారీ ప్లాన్ వేస్తున్నదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నాకౌట్ దశలో తమలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసి చివరిదాకా పోరాడేతత్వం ఉన్న కంగారూలతో జాగ్రత్తగా వ్యవహించాలని టీమిండియాకు సూచిస్తున్నారు.