హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే స్నేహిత్ సత్తాచాటాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్నేహిత్ 4-11, 11-5, 11-7, 8-11, 10-12, 5-11తో పయాస్ జైన్(ఢిల్లీ) చేతిలో ఓడి కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న స్నేహిత్..వరుసగా రెండు, మూడు గేముల్లో గెలిచి పోటీలోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు చేజార్చుకుని ఫైనల్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయాడు. మోకాలి గాయం నుంచి కోలుకునేందుకు సహకరించిన కోచ్ సోమనాథ్, ఫిట్నెస్ కోచ్ హిరాక్ బాగ్చీ, మెంటార్ శరత్‌కమల్‌కు స్నేహిత్ కృతజ్ఞతలు తెలిపాడు.