Sachin Tendulkar : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా భారత్ బలగాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నిర్వహించాయి. ఆ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ (Pakistan) లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) హర్షం వ్యక్తంచేశారు.
ఈ మేరకు సచిన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఐకమత్యంలో భయం ఉండదని, బలానికి ఎల్లలు లేవని, దేశ ప్రజలే భారత మాతకు రక్షణ కవచమని సచిన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి తావు లేదని, మనమంతా ఒక జట్టని అన్నారు. కాగా సచిన్ టెండూల్కర్ సందర్భం వచ్చిన ప్రతిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడిపై కూడా సచిన్ స్పందించారు.
అప్పడు ఆయన ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ‘నా అభిప్రాయంలో ఇది దేశంపై జరిగిన దాడి. ఇది ప్రతి భారతీయుడి హృదయాన్ని దెబ్బతీసింది. ఇది కేవలం ముంబై ప్రజలపై దాడి కాదు.’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సచిన్ ఇంగ్లండ్‌పై సెంచరీ చేశారు. ఆ సెంచరీని ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.