న్యూఢిల్లీ: డేగు(కొరియా) వేదికగా జరుగుతున్న ఏషియన్ ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో చెలరేగి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. బుధవారం జరిగిన మహిళల జూనియర్ 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో ఇషా రజత పతకంతో మెరిసింది.
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పసిడి పతక పోరులో ఈ హైదరాబాదీ యువ షూటర్ 15-17 తేడాతో మను భాకర్ చేతిలో పోరాడి ఓడింది. ప్రతీ పాయింట్‌కు ఇద్దరు హోరాహోరీగా పోరాడటంతో పోరు రసవత్తరంగా సాగింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఇషా 248.5 పాయింట్లతో టాప్‌లో నిలువగా, మను భాకర్(247.6) రెండో స్థానానికి పరిమితమైంది.