దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా లెక్కకు మిక్కిలి వికెట్లు తీసినా రాని గుర్తింపు.. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌లో మెరిస్తే ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం! ఇలా ఐపీఎల్లో మెరిసి నేడు అంతర్జాతీయ స్థాయిలో స్టార్లుగా వెలుగొందుతున్న వారెందరో! ఇటీవలే మొదలైన తాజా సీజన్లోనూ కొందరు కొత్త కుర్రాళ్లు ఆడిన ఒక్క మ్యాచ్‌తోనే ‘ఫ్యూచర్ స్టార్’ అయ్యే లక్షణాలు తమలో ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
IPL | ‘యత్ర ప్రతిభ అవ్సర్ ప్రప్నోతిహి’ – 18 సీజన్లుగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయే విధంగా ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మోటో ఇది. మన భాషలో చెప్పుకుంటే ‘ప్రతిభ అవకాశాన్ని కలిసే చోటు’. క్రికెట్ మతంగా వెలుగొందుతున్న భారత్‌లో క్రికెట్ వీరులకు.. అందునా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవేలేదు. కానీ కావాల్సిందల్లా వారి ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు సరైన వేదిక. అందుకే కుర్రాళ్లకు ఐపీఎల్ ఒక వరం.
గుజరాత్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య.. ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. సిరాజ్, రబాడా వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్ల బౌలింగ్‌లో ఏమాత్రం బెరుకు లేకుండా అలవోకగా షాట్లు ఆడి 23 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 204గా నమోదవడం విశేషం. గతేడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనే ఈ కుర్రాడి పేరు మార్మోగింది. సౌత్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు దంచడంతో పాటు 43 బంతుల్లోనే శతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను అతడిపై పడింది. వేలంలో ఈ ఢిల్లీ కుర్రాడిని పంజాబ్ ఏకంగా రూ. 3.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుని ఓపెనర్‌గా అవకాశమిచ్చింది.
గత సీజన్లో పంజాబ్‌కు ఆడిన అశుతోష్ శర్మ అంచనాలకు మించి రాణించాడు. 103 బంతులెదుర్కుని 189 పరుగులు చేసిన అతడు పలు మ్యాచ్‌లలో శశాంక్ సింగ్‌తో కలిసి అదరగొట్టాడు. తాజా సీజన్లో ఢిల్లీకి ఆడుతున్న ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 31 బంతుల్లో 5 బౌండరీలు, 5 భారీ సిక్సర్ల సాయంతో ఆఖరిదాకా అజేయంగా నిలిచి 66 పరుగులు చేయడంతో లక్నో నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ మరో 3 బంతులు మిగిలుండగానే పూర్తిచేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్.. ఒత్తిడిలోనూ నింపాదిగా ఉండి మ్యాచ్ ముగించిన తీరు అమోఘం! అశుతోష్ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమ్ఇండియా సెలెక్టర్లు.. తాజా సీజన్లో ఈ కుర్రాడిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశమూ లేకపోలేదు.
లక్నో-ఢిల్లీ మ్యాచ్‌లో క్యాపిటల్స్ విజయంలో అశుతోష్ పాత్ర ఎంత ఉందో అందుకు ఏమాత్రం తీసిపోని కష్టం విప్రాజ్ నిగమ్ది. 20 ఏండ్ల ఈ బారాబంకి (ఉత్తరప్రదేశ్) కుర్రాడు.. బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించగల సమర్థుడు. భారీ ఛేదనలో ఢిల్లీ 113/6 గా ఉండగా క్రీజులోకి వచ్చిన విప్రాజ్.. 15 బంతుల్లోనే ఐదు బౌండరీలు, 2 భారీ సిక్సర్లతో 39 రన్స్ చేసి ఢిల్లీని రేసులోకి తెచ్చాడు. బంతితోనూ మార్క్మ్‌న్రు బోల్తా కొట్టించాడు. అవకాశం వస్తే బాల్, బ్యాట్‌తో విప్రాజ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, అండర్-14, అండర్-19 దశ నుంచి అతడికి వెన్నతో పెట్టిన విద్య అని విప్రాజ్ కోచ్ సర్వర్ నవాబ్ తెలిపాడు.
వీరికి తోడు ముంబై తరఫున ఆడిన మలప్పురం స్పిన్ మాంత్రికుడు విఘ్నేశ్ పుతుర్.. రాజస్థాన్ బ్యాటర్ శుభమ్ దూబే.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రతి, సన్‌రైజర్స్ పేసర్ సిమర్జీత్ సింగ్ వంటి కుర్రాళ్లూ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటారు. రెండు నెలల పాటు జరుగబోయే ఈ మెగాటోర్నీలో మరింత మంది కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.