Wrestlers strike | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు బరిలోకి దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానంలో ఆందోళనకు దిగారు. బజరంగ్ పూనియా కోచ్‌ను తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన వారిలో బజరంగ్ పునియాతోపాటు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితర రెజ్లర్లు ఉన్నారు. వీరంతా జాతీయ రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రజ్ భూషణ్ శరణ్‌ను బహిష్కరించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు.
రెజ్లింగ్ క్రీడాకారుల పట్ల జాతీయ సమాఖ్య ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఈ సందర్భంగా వీరు ఆరోపించారు. అధికారులు ఏం చేసినా తమను నిలదీయాలని ఫెడరేషన్ ప్రయత్నించడం దారుణమన్నారు. దేశానికి పతకం సాధించినా గౌరవం దక్కడం లేదని విచారం వ్యక్తం చేశారు. దేశం కోసం పతకాలు సాధించినప్పుడు అందరూ చప్పట్లు కొడతారని, ఆ తర్వాత మా పరిస్థితి ఏమవుతుందో ఎవరూ చూడరని రెజ్లర్లు చెప్పారు.
విశాఖలో జరిగిన సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిఫ్‌లో సమాఖ్య కొత్త రిఫరీలను పిలిచింది. వీరికి నియమాలు తెలియకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దాంతో క్రీడాకారులు తీవ్ర అసంతృప్తికి లోనై సమాఖ్యను ప్రశ్నించారు. మ్యాచ్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు బజరంగ్ పూనియా వ్యక్తిగత కోచ్ సుజిత్ మాన్‌ను సమాఖ్య సస్పెండ్ చేసింది. సోనిపట్‌లోని సీనియర్ క్యాంపులో సుజిత్ మాన్ పేరు కనిపించకపోవడంతో రెజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రెజ్లర్లు చెప్తున్నారు.