Indian Hockey : భారత మహిళల హాకీ జట్టు(Hockey Team)కు ఊహించని షాక్ తగిలింది. చీఫ్ కోచ్‌గా ఉన్న జన్నెకె స్కాప్‌మన్(Janneke Schopman) శనివారం తన పదవికి రాజీనామా చేసింది. భారత్‌లో మహిళలకు తగిన గౌరవం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే ఆమె పదవి నుంచి వైగొలగడం గమనార్హం.
‘భారత మహిళల సీనియర్ హాకీ జట్టు జట్ఉట చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. హాకీ ఇండియా, సాయ్లకు ఒక నెల ముందస్తు నోటీస్ పంపిస్తున్నా. మార్చి 23వ తేదీన నా పదవి ముగుస్తుంది. నాకు రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని కోరుతున్నా. భారత జట్టుతో తాను కొనసాగిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ స్కాప్‌మన్ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు వరకు హాకీ ఇండియాతో కాంట్రాక్ట్ ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 46 ఏండ్ల స్కాప్‌మన్ జట్టును వీడాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఐదు నెలల ముందే ఆమె రాజీనామా సమర్పించింది.

నెదర్లాండ్స్‌కు చెందిన స్కాప్‌మన్ 2020 జనవరిలో అనలిటికల్ కోచ్‌గా భారత జట్టులో చేరింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టింది. స్కాప్‌మన్ ఆధ్వర్యంలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2022 ఆసియా కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అంతేకాదు నిరుడు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బంగారు పతకం కొల్లగొట్టింది. అయితే.. ప్రతిష్ఠాత్మకమైన ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) మాత్రం బెర్తు దక్కించుకోలేకపోయింది. వరుసగా ఆసియా గేమ్స్, ఎఫ్ఐహెచ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో దారుణంగా విఫలమై విశ్వ క్రీడల బెర్తు దూరం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు

అయినా సరే స్కాప్మన్ను కొనసాగించాలని హాకీ ఇండియా భావించింది. కానీ, ఆమె వారం క్రితం హాకీ ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను ఎవరూ గౌరవించడం లేదని, భారత్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదని స్కాప్‌మన్ అంది. దాంతో, ఆమె కోచ్ పదవికి రాజీనామా చేసే చాన్స్ ఉందనే ఊహగానాలు వినిపించాయి. అనుకున్నట్టుగానే స్కాప్‌మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.