ముంబై: భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెండ్లి రైద్దెంది. గత నెల 23న ఈ ఇద్దరి వివాహం నిశ్చయమై సందడిగా హల్దీ, ఇతర కార్యక్రమాలు జరిగినా పెండ్లికి సరిగ్గా ఒక్కరోజు ముందు మంధాన తండ్రి అనారోగ్యానికి గురై దవాఖాన పాలవడంతో ఆ కార్యక్రమం వాయిదాపడ్డ విషయం తెలిసిందే. తాజాగా రెండు వారాల అనంతరం ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వేర్వేరుగా పోస్టులు పెట్టి తమ పెండ్లి రైద్దెందని ప్రకటించారు. ముందుగా మంధాన.. ‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. దీనిపై నేను మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది.
నా గురించి అన్ని గోప్యంగా ఉండాలనే భావించే వ్యక్తిని. నా వివాహం రైద్దెందని స్పష్టం చేయదలుచుకున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. మా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించి ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
వివాహం రైద్దెనా ఇకపై తన దృష్టంతా క్రికెట్ మీదే నిలుపుతానని, దేశానికి అత్యున్నత స్థాయిలో మరిన్ని ట్రోఫీలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొంది. పలాశ్ సైతం ఇన్‌స్టాలో ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నా. నా పర్సనల్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాను. ఎటువంటి ఆధారాల్లేని వదంతులను నమ్ముతున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉంది’ అని రాసుకొచ్చాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ముచ్చల్ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.