Rising Stars Asia Cup | త్వరలో ప్రారంభం కానున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 కోసం ఇండియా ఏ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జితేశ్ శర్మ కెప్టెన్‌గా నియమించగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఐపీఎల్ స్టార్ ప్రియాంష్ ఆర్యలకు జట్టులో చోటు కల్పించింది. ఈ టోర్నీ నవంబర్ 14 నుంచి 23 వరకు ఖతార్‌లోని దోహాలో జరుగనున్నది. భారత జట్టు గ్రూప్-బీ ఉంది. ఇందులో ఒమన్, యూఏఈ, పాక్ జట్లు.. ఇక గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారత జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న జితేష్ శర్మ ఆసియా కప్‌లో ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో సభ్యుడు. ఇటీవల జితేష్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టీ20లో అజేయంగా 22 పరుగులతో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. అతని అనుభవం, నాయకత్వం యువ ఆటగాళ్లకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చారిత్రాత్మక 101 పరుగుల ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అండర్-19 టెస్ట్‌లో కూడా సెంచరీ నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన ప్రియాంష్ ఆర్య, సెప్టెంబర్‌లో ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏతో మధ్య జరిగిన అనధికారిక వన్డేలో కూడా సెంచరీ సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో చోటు దక్కింది.
ఈ టోర్నమెంట్‌ను గతంలో ఇండియా ఎమర్జింగ్ కప్‌గా పిలుస్తుండేవారు. ఇది ప్రధానంగా అండర్-23 టోర్నమెంట్. దీన్ని ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌గా పిలుస్తారు. కానీ, ప్రస్తుతం భారత్ సహా అనేక దేశాలు ప్రతిభ, అనుభవ సమతుల్యతను కొనసాగించేందుకు యువ, సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పిస్తున్నాయి. ఈ టోరనీలో ఆరు ఎడిషన్స్ జరిగాయి. గత ఆరు ఎడిషన్స్‌లో భారత్ 2013లో తొలి ఎడిషన్‌లో ఒకసారి మాత్రమే టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. 2017, 2018లో శ్రీలంక టైటిల్ గెలుచుకోగా.. పాకిస్థాన్ 2019, 2023లో టైటిల్‌ను సాధించాయి. 2024లో ఆఫ్ఘనిస్థాన్ టైటిల్ గెలుచుకుంది.
భారత జట్టు : జితేష్ శర్మ (కెప్టెన్-వికెట్ కీపర్), నమన్ ధీర్ (వైస్ కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, సూర్యాంశ్ షెడ్గే, రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, గుర్జాప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైషాక్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాశ్ శర్మ, అశుతోష్ శర్మ.
స్టాండ్ బై ప్లేయర్లు : గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనుష్ కోటియన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్.