భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువుతో అనర్హత వేటుకు గురై వెండి పతకం కోసం వినేశ్ చేసిన అప్పీల్‌ను అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) అనూహ్యంగా తిరస్కరించింది. పలు వాయిదాల తర్వాత కాస్ అడ్హాక్ డివిజన్ బుధవారం వెలువరించిన తీర్పు భారత క్రీడాభిమానులను కలతకు గురిచేసింది. వినేశ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటుందనుకున్న కాస్ సుదీర్ఘ వాదనల తర్వాత కఠిన నిబంధనలకు కట్టుబడుతూ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌కు ఏడో పతకంపై ‘ఏడు’పే మిగిలింది. కాస్ తీర్పుపై భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం మానవీయ విలువలకు కట్టుబడకుండా విజ్ఞప్తిని కాస్ తిరస్కరించిన తీరును తప్పుబట్టింది. పోరాటాన్ని అణువణువునా నింపుకున్న వినేశ్ ఫోగాట్ కాస్ తీర్పును సవాలు చేసే అవకాశముంది.
పారిస్: యావత్ భారత జాతి మరికొన్ని గంటల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ..క్రీడాభిమానులను నిరాశకు గురి చేసే వార్త ఇది. 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు అంతర్జాతీయ క్రీడాన్యాయ స్థానం(కాస్)లో ఉహించని రీతిలో చుక్కెదురైంది. వాయిదాల పడుతూ వచ్చిన తీర్పు వినేశ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. బుధవారం కాస్ అడ్హాక్ డివిజన్ వినేశ్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కనీసం వెండి పతకం కోసమైనా పరిగణనలోకి తీసుకోవాలన్న ఫోగాట్ అప్పీల్‌ను కాస్ తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడో పతకం ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం నాడు కాస్ తీర్పును ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య కాస్ బుధవారం అప్పీల్‌ను తిరస్కరించినట్లు ఐవోఏ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) కఠిన నిబంధనలకు కట్టుబడుతూ కాస్ తీర్పు వచ్చినట్లు తెలుస్తున్నది.
సుదీర్ఘ వాదనల తర్వాత: అధిక బరువుతో అనర్హత వేటుకు గురి కావడంతో వినేశ్ ఫోగాట్..అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం (కాస్)ను ఆశ్రయించింది. ఒలింపిక్స్‌లో ప్లేయర్ల సమస్యల పరిష్కారం కోసం పారిస్‌లో తాత్కాలికంగా కాస్ అడ్హాక్ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్నాబెల్లె బెన్నెట్..ఏకైక ఆర్బిట్రార్గా వ్యవహరించారు. ఈ కేసులో వినేశ్ ఫిర్యాదుదారు కాగా, యూడబ్ల్యూడబ్ల్యూ, ఐవోసీ ప్రతివాదులుగా ఉన్నాయి. అయితే ఈనెల 9న దాదాపు మూడు గంటల పాటు ఇరు పక్షాల మధ్య సాగిన సుదీర్ఘ వాదనలను అర్బిట్రార్ పరిశీలించారు. తొలుత ఫ్రెంచ్ లాయర్లు వినేశ్ వాదనలు వినిపించగా, భారత్‌కు చెందిన సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియాను ఐవోఏ నియమించింది. మంగళవారం జరిగిన వాదనల్లోనూ వినేశ్ అనర్హతకు సంబంధించి పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా బరువు అనేది అథ్లెట్‌కు ఉన్న ప్రాథమిక హక్కు. పోటీల తొలి రోజు నిర్దేశిత బరువు ప్రమాణాలకు అనుగుణంగానే ఆమె పోటీల్లో పాల్గొంది. మూడు బౌట్లలో పోటీ తర్వాత మరుసటి రోజు ఉదయం జరిగిన పరీక్షల్లో కేవలం 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అనర్హతకు గురైన తర్వాత వినేశ్ ఫోగాట్ తనకు ఫైనల్లో పోటీపడే అవకాశం కల్పించాలని కాస్ అడ్‌హక్ డివిజన్‌ను అభ్యర్థించింది. అయితే కాల వ్యవధి తక్కువ ఉండటంతో ఫోగాట్ అప్పీల్‌ను కాస్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో నిర్దేశిత బరువు ప్రమాణాలతో ఫైనల్‌కు చేరుకున్న తనకు రజత పతకం ఇవ్వాలని కోరింది. 100 గ్రాముల అంశాన్ని కాకుండా మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలంటూ వినేశ్తో పాటు ఆమె తరఫు లాయర్లు కాస్‌లో వాదించినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే ఓవైపు ఫోగాట్ కేసు కాస్‌లో విచారణ జరుగుతుండగానే యూడబ్ల్యూడబ్ల్యూ చీఫ్ నెనాద్ లలోవిచ్తో పాటు ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ ‘రూల్ ఈజ్ రూల్’ కుండబద్దలు కొట్టారు. నిబంధనల సడలింపు అనే దానికి ఎండ్ పాయింట్ ఎక్కడా లేదంటూ వ్యాఖ్యానించారు.
దేశ క్రీడాలోకాన్ని తీవ్రంగా నిరుత్సాహరుస్తూ వినేశ్ ఫోగాట్ అప్పీల్‌ను కాస్ కొట్టిపడేయడం నిరాశకు లోనుచేసింది. తదుపరి న్యాయసంబంధ అంశాల్లో వినేశ్‌కు అన్ని విధాలుగా సహకరించేందుకు ఐవోఏ సిద్ధంగా ఉంది. కేవలం వంద గ్రాముల అధిక బరువుతో కేవలం వినేశ్ కెరీర్‌కే కాదు నిబంధనలు వాటి పర్యావసనాలు ప్లేయర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. పోటీల రెండో రోజు నిర్ణీత బరువు కంటే ఎక్కువగా ఉండటాన్ని కారణంగా చూపుతూ వేటు వేశారు. చివరి నిమిషం వరకు అర్హత పొందేందుకు ప్రయత్నించిన వినేశ్ తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఇది కేవలం వినేశ్ విషయంలోనే కాదు..మహిళా ప్లేయర్లను మానసికంగా ఒత్తిడి గురిచేసే అంశం. అర్హత విషయంలో అథ్లెట్లకు మరింత మెరుగైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరముంది.
అధికారిక వెబ్సైట్ ప్రకారం కాస్‌లో తిరిగి వినేశ్ అప్పీల్ చేసేందుకు అవకాశమున్నప్పటికీ తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని పరిమితమైన అంశాల్లోనే స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్ కేసులను పరిశీలిస్తుంది. ముఖ్యంగా విచారణాధికారంలో లోపాలతో పాటు న్యాయపరమైన అంశాలు(ఉదాహరణకు నిస్పక్షపాత వాదనల్లో ఉల్లంఘనలు, పబ్లిక్ పాలసీకి అసంబద్ధంగా ఉండటం) ఉన్నప్పుడు కోర్టు కలుగజేసుకుంటుంది. వినేశ్ కేసు విషయంలో ఫ్రెంచ్ లాయర్లు జోయెల్లె మనోలిస్, ఎస్టెల్లె ఇవనోవా, హబైన్ ఎస్టెల్లె కిమ్, చార్లెస్ అమ్సన్ సహకరించారు. వీరికి తోడు భారత లాయర్లు హరీశ్‌సాల్వే, విదుష్పత్ సింఘానియా కేసులో వాదనలు వినిపించారు.