Vinesh Phogat | పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఒలింపిక్ పతకం గెలవాలన్న తన కల నెరవేరకుండానే ఆమె ఆటపై ‘పట్టు’ సడలించింది. పారిస్‌లో సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించినా తుది పోరుకు కొద్దిగంటల ముందు వంద గ్రాములు అదనపు బరువుతో ‘అనర్హత’ వేటు ఎదుర్కొన్న ఆమె గురువారం ‘ఎక్స్’ వేదికగా తన తల్లిని ఉద్దేశిస్తూ.. ‘అమ్మా, కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నీ ఆశలు, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. 2001 నుంచి 2024 దాకా సాగిన నా రెజ్లింగ్ ప్రయాణానికి వీడ్కోలు.
మీ అందరికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని రాసుకొచ్చింది. ఐవోసీ విధించిన అనర్హత వేటుకు సంబంధించిన విచారణ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) వద్ద విచారణకు ఉండగానే వినేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ క్రీడాభిమానులు మరోసారి నివ్వెరపోయారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమెకు సూచించారు. ఫోగాట్ పెద్దనాన్న మహావీర్ ఫోగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆమె నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరారు.
ఐవోసీ విధించిన ‘అనర్హత’ వేటుపై అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫోగాట్‌కు భారీ ఊరట దక్కింది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీఏఎస్.. శుక్రవారం విచారణ జరుపనుంది. వినేశ్ తరఫున నలుగురు న్యాయవాదులతో కూడిన బృందం వాదనలు వినిపించనుంది. వారిలో ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, విధుష్పట్ సింఘానియా కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం విచారణకు రానున్న ఈ కేసులో ఇదే రోజు తీర్పు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.