దోహా : టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్యాడ్లర్లు మనిక బాత్రా, మానవ్ టక్కర్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా అధిగమించారు. మహిళల సింగిల్స్‌లో 22వ సీడ్‌గా బరిలోకి దిగిన మనిక.. 4-0 (11-5, 11-6, 11-2, 11-2)తో ఫాతిమా బెల్లొ (నైజీరియా)పై అలవోక విజయం సాధించింది.
24 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో మనిక.. వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో మానవ్.. 4-1 (11-3, 11-8, 6-11, 11-7, 14-12)తో తిమోతి చోయ్ (న్యూజిలాండ్)ను ఓడించాడు. ఈ ఇద్దరూ గెలిచినా మిగిలిన మ్యాచ్‌లలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో అంకుర్, మిక్స్డ్ డబుల్స్‌లో మనుష్-దివ్య ద్వయం, పురుషుల డబుల్స్‌లో హర్మీత్ -సతియన్ జోడీ అపజయం పాలైంది.