లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో తన్వి 21-13, 21-19తో లీ సిన్ యన్(హాంకాంగ్)పై అలవోక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటికే మాజీ వరల్డ్ చాంపియన్ నజొమి ఒకుహరను చిత్తుచేసిన 16 ఏండ్ల తన్వి..సెమీస్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. 38 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి..హాంకాంగ్ షట్లర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకున్న తన్వి..రెండో గేమ్‌లోనూ ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో హినా అకెచితో తన్వి తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో ఉన్నతి హుడా 21-15, 13-21, 21-16తో భారత్‌కే చెందిన రక్షిత శ్రీపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 11-4తో ప్రియాంశు రజావత్‌పై గెలిచి సెమీస్ బెర్తు దక్కించుకున్నాడు. మ్యాచ్ మధ్యలోనే ప్రియాంశు వైదొలుగడంతో శ్రీకాంత్ ముందంజ వేశాడు.