న్యూఢిల్లీ : భారత షూటింగ్ చరిత్రలో అద్భుతమైన అధ్యాయం ముగిసింది. దేశానికి ఎన్నో పతకాలు అందించి, అంతకంటే గొప్పగా ప్రపంచ స్థాయి చాంపియన్లను తయారు చేసిన లెజెండరీ షూటర్, ద్రోణాచార్య అవార్డీ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మే 31 వరకు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన షూటింగ్ ప్రపంచకప్ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన రాణా.. ఢిల్లీకి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించి వైద్యసాయం అందించారు. గుండె కవాటాల్లో బ్లాకేజ్‌ను గుర్తించిన వైద్యులు స్టెంట్ వేశారని, అయితే మరోమారు తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం జస్పాల్ మృతి చెందినట్లు ఆయన సోదరుడు సుభాశ్ రానా పేర్కొన్నారు. రాణా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
1976లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన జస్పాల్ రాణా షూటింగ్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. 18 ఏండ్ల వయసులో1994 హిరోషిమా ఆసియా గేమ్స్‌లో సాధించిన స్వర్ణ పతకం.. భారత షూటింగ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆసియా గేమ్స్‌లో 4 స్వర్ణాలు సహా 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో ఏకంగా 9 స్వర్ణాలు సహా 15 మెడల్స్ గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 4 స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డు (1994), పద్మశ్రీ (1997), కోచ్‌గా ద్రోణాచార్య (2020) పురస్కారాలతో గౌరవించింది.

ప్లేయర్‌గానే కాకుండా కోచ్‌గా రాణా భారత షూటింగ్‌ను నెకస్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. నేటి తరం స్టార్ షూటర్లంతా ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నవారే. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ కు రాణానే ప్రధాన మార్గదర్శి. ఆయన మృతదేహాన్ని చూసి మను భాకర్ కన్నీరుమున్నీరుగా విలపించింది. హైదరాబాదీ స్టార్ షూటర్ ఇషా సింగ్‌తో పాటు సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలా, చింకి యాదవ్ వంటి ఎందరో చాంపియన్లు రాణా దగ్గర శిక్షణ పొంది రాటుదేలినవారే.
జస్పాల్ సార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారంటే నేను నమ్మలేకపోతున్నా. రెండు వారాల కిందట మ్యూనిచ్ వరల్ కప్‌లో ఆయన మా అందరితో ఎంతో సరదాగా గడిపారు. అస్వస్థతకు గురైనా త్వరగానే కోలుకుంటారని ఆశించాను కానీ, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. 2018 నుంచి సార్‌ను రేంజ్లో చూస్తున్నా.

కొంతకాలం ఆయన పర్యవేక్షణలోనే ప్రత్యేక శిక్షణ పొందే సువర్ణ అవకాశం నాకు దక్కింది. తన చుట్టూ ఉన్న అథ్లెట్లపై సార్‌కు ఎప్పుడూ అపారమైన నమ్మకం ఉండేది. నువ్వు ఈ క్రీడలో గొప్ప విజయాలు సాధించడానికి పుట్టావు.. కష్టకాలంలోనూ నీ ప్రయాణాన్ని నువ్వు నమ్ముకో’ అంటూ ఆయన చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. మిస్ యూ జస్పాల్ సార్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి