దోహా: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలిరోజే 3 పతకాలతో సత్తాచాటిన మన షూటర్లు.. రెండో రోజూ అదే జోష్ కొనసాగించారు. మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రర్ పసిడి పతకాన్ని గురిచేసి కొట్టింది. 21 ఏండ్ల సిమ్రన్ప్రీత్.. 41 పాయింట్లు స్కోరుచేసి పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ యాంగ్ జి-ఇన్ (దక్షిణకొరియా)కు షాకిచ్చి స్వర్ణం దక్కించుకుంది.
ఇక తొలిసారి ఈ టోర్నీ ఆడుతున్న యువ షూటర్ ఐశ్వర్య్ ప్రతాప్ సింగ్ తోమర్.. మొదటి ప్రయత్నంలోనే రజతంతో సత్తాచాటాడు. ఆదివారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో ఐశ్వర్య్.. 0.9 పాయింట్ల తేడాతో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఫైనల్ పోరులో అతడు 413.3 పాయింట్లు స్కోరు చేయగా చెక్ ఆటగాడు జిరి ప్రివ్రస్కీ (414.2) పసిడి దక్కించుకోగా చైనా షూటర్ యుకున్ లియు (388.9) కాంస్ంయ గెలిచాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ ఈవెంట్లో అనీష్ భన్వాలా సైతం రజతం నెగ్గాడు.