ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ పార్థ్ రాకేశ్ మనె రెండు స్వర్ణాలు నెగ్గాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో పసిడి నెగ్గిన పార్థ్.. ఇదే విభాగంలోని టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం గెలిచాడు. వ్యక్తిగత ఫైనల్లో అతడు 250.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అజయ్ మాలిక్, అభినవ్ షాతో కలిసి టీమ్ ఈవెంట్లో పాల్గొన్న పార్థ్.. 1883.5 పాయింట్లతో మరో స్వర్ణాన్ని కొల్లగొట్టాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత బృందం గౌతమి, సంభవి, అనోష్క త్రయం 1883.5 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచి పసిడిని ముద్దాడింది. ఇదే విభాగంలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గౌతమి, అజయ్ ద్వయం కాంస్యంతో మెరిసింది. ఈ టోర్నీలో భారత్ 5 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు దక్కించుకుని పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది.