‘దేశం ఒకవైపు యుద్ధం చేస్తుంటే మీరు తాపీగా క్రికెట్ ఆడతారా?’ అంటూ వెల్లువెత్తిన విమర్శలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ దిగొచ్చింది. ధర్మశాల మ్యాచ్ రైద్దెనప్పటికీ లీగ్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన బీసీసీఐ.. 18వ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దాయాదుల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలతో ఐపీఎల్-18ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. దేశ ప్రయోజనాలు, ఆటగాళ్ల భద్రతకు పెద్దపీట వేస్తామన్న బీసీసీఐ.. లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణపై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
ముంబై: భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన యుద్ధ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)నూ తాకింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. బాంబుల మోతతో సరిహద్దుల వద్ద ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా దాయాది దేశంతో భారత సైనికులు వీరోచితంగా పోరాడుతున్న తరుణంలో ఐపీఎల్ నిర్వహణ సరికాదంటూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దెన వెంటనే లీగ్ కొనసాగింపుపై అనుమానాలు తలెత్తగా.. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐపీఎల్ పాలకమండలి.. 18వ సీజన్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. వాయిదా నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడంతో శుక్రవారం లక్నో వేదికగా జరగాల్సి ఉన్న లక్నో-బెంగళూరు మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ మేరకు బీసీసీఐ స్పందిస్తూ.. ‘ఐపీఎల్-18వ సీజన్‌ను వారం రోజులు వాయిదా వేస్తున్నాం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. బ్రాడ్‌కాస్టర్, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయానికొచ్చాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ దేశానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. మన సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్థ సేవలకు సెల్యూట్ చేస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే విషయమై బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. దేశంలో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ తమకు దేశ ప్రయోజనాలు, ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యమని తెలిపారు. దేశం ఒకవైపు యుద్ధం చేస్తుంటే లీగ్ నిర్వహణ సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ మెగా లీగ్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసిన బీసీసీఐ.. మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ, షెడ్యూల్, వేదికలు, ఇతర వివరాలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మే 8 నాటికి ఐపీఎల్లో 58 మ్యాచ్‌లను నిర్వహించగా ఈ సీజన్లో మరో 12 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు మిగిలున్నాయి.
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటం ఇదేం కొత్త కాదు. 2009, 2020, 2021లోనూ ఐపీఎల్ వాయిదా పడింది. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ సీజన్ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో ఆడించారు. 2020లో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన కరోనా కారణంగా ఏప్రిల్-మేలో జరగాల్సిన లీగ్ కాస్తా సెప్టెంబర్‌కు వాయిదా (ఆ ఏడాది దుబాయ్‌లో నిర్వహించారు) పడింది. ఇక 2021లో బయో బబుల్‌లో ఐపీఎల్‌ను ఆడించినా సీజన్ మధ్యలో పలువురు ఆటగాళ్లు కోవిడ్ పాజిటివ్‌కు గురవడంతో ఉన్నఫళంగా సీజన్‌ను వాయిదా వేసి సెప్టెంబర్‌లో దుబాయ్‌లో నిర్వహించారు.
తాజా సీజన్‌ను ప్రస్తుతానికి వారం రోజుల పాటు వాయిదా వేసినప్పటికీ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ ఇప్పుడైతే సాధ్యం కాదన్న వాదనే వినబడుతున్నది. షెడ్యూల్ ప్రకారం మే 25కు ఐపీఎల్ ముగియాల్సి ఉండగా తాజా వాయిదాతో దానిని జూన్ మొదటి వారానికి పొడిగించాల్సి వచ్చింది. కానీ జూన్ నుంచి అంతర్జాతీయ సిరీస్‌లకూ తెరలేవనుంది. జూన్ 11 నుంచి దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగాల్సి ఉండగా ఇరు దేశాల క్రికెటర్లలో చాలా మంది ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్లంతా అప్పటి దాకా వేచిఉండటం అనుమానమే. ఇంగ్లండ్ ప్లేయర్లలో పలువురు మే మూడో వారంలోనే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నట్టు సమాచారం.
మరో వైపు భారత జట్టు సైతం జూన్‌లోనే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆగస్టు దాకా ఆ పర్యటన సాగనుంది. ఆగస్టులోనే ఇంగ్లండ్‌లో నిర్వహించే ‘ది హండ్రెడ్’ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. అదే సమయానికి భారత్ ఆసియా కప్‌నకు ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో ఆ టోర్నీని రద్దు చేసి (?) ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.