బతుమి(జార్జియా): ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు కొనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతున్నది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గేమ్ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. హంపి తెల్లపావులతో బరిలోకి దిగగా, నల్లపావులతో దివ్య అటాకింగ్ గేమ్‌ను ఎంచుకుంది. గేమ్ సాగుతున్న కొద్దీ ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.
సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిళ్లు గెలిచిన అనుభవం 38 ఏండ్ల హంపిది అయి తే ఆమె వయసులో సగమున్న దివ్య దూకుడును ఎంచుకుంది. గేమ్‌లో తొలుత దివ్య ఒకింత ఆధిక్యం కనబర్చగా, హంపి దీటుగా స్పందించింది. క్వీన్, రూక్తో ఒక్కసారిగా హంపి గేమ్ రూపురేఖలను మార్చింది. గేమ్ ముందుకు సాగితే ఫలితం మరోలా ఉంటుందన్న అంచనాతో హంపి, దివ్య డ్రాకు ఒప్పుకున్నారు. ఆదివారం ఇద్దరి మధ్య రెండో గేమ్ జరుగనుంది. ఒకవేళ ఇది కూడా డ్రా అయితే అప్పుడు టైబ్రేక్ ద్వారా ఫలితం తేలనుంది.