Paralympics 2024 : పారిస్ పారాలింపిక్స్ 2024 (Paris Paralympics 2024) లో భారత్ బోణీ చేసింది. భారత మహిళా షూటర్లు తమ సత్తా చాటారు. పారాలింపిక్స్ షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (10m air rifle) విభాగంలో భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్లు అవని లెఖారా (Avani Lekhara), మోనా అగర్వాల్ (Mona Agarwal) చెరో పతకం సాధించారు.
ఇవాళ ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్స్ జరిగాయి. అందులో అవని లెఖారా రెండో స్థానంలో, మోనా అగర్వాల్ ఐదోస్థానంలో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో అవని లెఖారా పసిడిపట్టు పట్టింది. టోక్యో పారాలింపిక్స్‌లో తన పేరిటే నమోదైన అత్యధిక స్కోర్ రికార్డును అవని బద్దలుకొట్టి మళ్లీ పసిడి పతకం గెలుచుకుంది.
టోక్యో పారాలింపిక్స్‌లో అవని లెఖారా 249.6 స్కోర్ చేయగా.. ఈ ఒలింపిక్స్‌లో 249.7 స్కోర్ చేసి తన రికార్డును తానే తిరగరాసింది. మోనా అగర్వాల్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.