రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమయ్యాయి. యూఈఏ వేదికగా ఆసియా కప్ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియాను ఎంపిక చేస్తే..స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలో అమ్మాయిల జట్టు బరిలోకి దిగనుంది. ముంబైలో మంగళవారం గంటల వ్యవధిలో సమావేశమైన సెలెక్షన్ కమిటీలు రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. ఊహించినట్లుగానే శుభ్మన్గిల్కు వైస్ కెప్టెన్సీగా దక్కగా, శ్రేయాస్ అయ్యర్‌కు చుక్కెదురైంది. బుమ్రాకు బెర్తు దక్కగా, సిరాజ్ టీ20 టీమ్ టికెట్ మిస్సయ్యింది. కౌర్ కెప్టెన్సీలో భారత జట్టుకు హైదరాబాదీ అరుంధతిరెడ్డి, ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి ఎంపిక కాగా, హార్డ్‌హిట్టర్ షెఫాలీవర్మకు మొండిచేయి ఎదురైంది. ఒకే రోజు రెండు వేర్వేరు జట్లు ప్రకటించగా, కొందరికి అదృష్టం కలిసిరాగా, మరికొందరిని దురదృష్టం వెంటాడింది.
ముంబై: యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీ కోసం టీమ్ఇండియాను ప్రకటించారు. మంగళవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, అందరూ ఊహించినట్లు గానే యంగ్ అండ్ డైనమిక్ శుభ్‌మన్‌గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి జట్టు ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధతకు సెలెక్టర్లు ఫుల్స్టాప్ పెట్టారు. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఆసియాకప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఒమన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూపు-‘ఏ’లో బరిలోకి దిగుతున్నది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడంపై బీసీసీఐ ఆలోచన ఏంటో స్పష్టంగా కనిపిస్తున్నది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌ను ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ పావులు కదుపుతున్నది. ఐపీఎల్‌తో యువ క్రికెటర్లు అంచనాలకు మించి రాణిస్తున్న వేళ జట్టు ఎంపిక సెలెక్టర్లకు ఒక రకంగా కత్తిమీద సాములా మారింది.
ఇటీవలి అండర్సన్-టెండూల్కర్ సిరీస్ గిల్ జాతకాన్ని మార్చేసింది. ఇంగ్లండ్ పేస్ పిచ్‌లపై అంచనాలకు మించి రాణించిన గిల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు కనీసం అర్ధసెంచరీ లేని చోట గిల్ ఏకంగా డబుల్ సెంచరీ సహా నాలుగు సెంచరీలతో టోర్నీ టాపర్‌గా నిలిచాడు. దీనికి తోడు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో కెప్టెన్‌గాను విజయవంతమయ్యాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున సెలెక్టర్లు అక్షర్‌పటేల్‌ను తప్పిస్తూ తిరిగి గిల్‌కే వైస్ కెప్టెన్సీ పగ్గాలు అందించారు. గిల్ చేరికతో టాపార్డర్‌లో తీవ్ర పోటీ నెలకొన్నది.
ఇప్పటికే అభిషేక్, తిలక్, శాంసన్‌తో టాప్-3 కుదురుకోగా గిల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే శాంసన్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. శ్రేయాస్ అయ్యర్ విషయానికొస్తే..ఇటీవలి ఐపీఎల్లో అదరగొట్టిన అయ్యర్‌కు బెర్తు దక్కలేదు. దూకుడుగా ఆడటంలో ముందుండే అయ్యర్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది. దీనిపై అగార్కర్ స్పందిస్తూ ‘జట్టులో తీవ్ర పోటీ వాతావరణం ఉంది. అయ్యర్‌ను తీసుకోవాలంటే ఎవరో ఒకరిపై వేటు వేయాల్సి ఉంటుంది. ప్రతిభ ఉన్నా..అయ్యర్‌ను తీసుకోలేకపోయాం. జట్టులో స్థానం కోసం అయ్యర్ కొన్ని రోజులు వేచిచూడాలి’ అని స్పష్టం చేశాడు.
స్టార్ పేసర్ బుమ్రా ఆసియాకప్‌నకు ఎంపిక కాగా, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇరగదీసిన హైదరాబాదీ సిరాజ్‌కు చుక్కెదురైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిసింది. ఆసియాకప్‌లో అర్ష్‌దీప్‌సింగ్, బుమ్రా, హర్షిత్రానా పేస్ దళాన్ని నడిపించనున్నారు.
ముంబై: స్వదేశం వేదికగా జరుగునున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టును ఎంపిక చేశారు. మంగళవారం ముంబైలో సమావేశమైన నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అటు ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే పెద్దగా మార్పుల్లేకుండా వరల్డ్‌కప్ టోర్నీకి 15 మందితో కూడిన టీమ్ జాబితాను విడుదల చేశారు. హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మందన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సీనియర్ పేసర్ రేణుకాసింగ్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకుంది. గాయం కారణంగా శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌తో పాటు ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు రేణుక దూరమైంది.
‘పూర్తి ఫిట్నెస్ సాధించిన రేణుక జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. గాయంతో కొన్ని రోజులు దూరమైన రేణుక ఆసీస్ సిరీస్‌తో పాటు మెగాటోర్నీలో భారత్‌కు కీలకం కానుంది’అని నీతూ డేవిడ్ పేర్కొంది. రేణుకాకు తోడు క్రాంతిగౌడ్, అరుంధతిరెడ్డి భారత పేస్ దళాన్ని నడిపించనున్నారు. అయితే ఆల్‌రౌండర్ అమన్జ్యోత్కౌర్ను ఆసీస్ సిరీస్‌కు పక్కకు పెట్టిన సెలెక్టర్లు మెగాటోర్నీ జట్టుకు ఎంపిక చేశారు. దీనిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ ‘కౌర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)లో పునరావాసం పొందుతున్నది. ప్రపంచకప్ నాటికి ఆమె పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆసీస్ సిరీస్‌కు అమన్‌జ్యోత్ స్థానంలో సయాలీ సత్గరెను తీసుకున్నాం’ అని అంది.
అంతా ఊహించినట్లుగానే హార్డ్ హిట్టర్ షెఫాలీవర్మకు చుక్కెదురైంది. గతంలో ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగిన షెఫాలీ ఫామ్‌లేమితో తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో జట్టులోకి వచ్చి రావడంతోనే ప్రతీకా రావల్ సత్తాచాటింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓపెనర్‌గా 14 వన్డేల్లో అదరగొట్టింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు షెఫాలీ వైపు కాకుండా ప్రతీక వైపు మొగ్గుచూపారు. మందనకు రైట్‌హ్యాండ్ బ్యాటర్ రావల్ సరైన జోడీ అంటూ ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న షెఫాలీకి అద్భుత భవిష్యత్ ఉందని సెలెక్షన్ కమిటీ చైర్మన్ నీతూ అభిప్రాయపడింది. మరిన్ని మ్యాచ్‌లు ఆడటం ద్వారా షెఫాలీ మరింత అనుభవం గడిస్తుందని, వన్డేల్లో కీలకంగా ఎదిగే అవకాశం ఆమెకు ఉందని పేర్కొంది.
ప్రపంచకప్ టోర్నీకి హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అరుంధతిరెడ్డితో పాటు ఆంధ్రకు చెందిన యువ స్పిన్నర్ శ్రీచరణి చోటు దక్కించుకున్నారు. రేణుకా, క్రాంతితో కలిసి పేస్ బౌలింగ్ బాధ్యతలను అరుంధతి పంచుకోనుంది. కచ్చితమైన వేగానికి స్వింగ్ జోడిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఆదిలోనే దెబ్బతీయడంలో అరుంధతికి మంచి రికార్డు ఉంది.
ఇటీవలి సిరీస్‌ల్లో ఈ యువ పేసర్ నిలకడగా రాణించి సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొన్నది. మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తన స్పిన్ మాయాజాలంతో 10 వికెట్లు తీసిన శ్రీచరణి మెగాటోర్నీకి బెర్తు దక్కించుకుంది. స్వదేశంలో పిచ్‌లు స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో దీప్తిశర్మ, రాధా, స్నేహ్రానాతో కలిసి శ్రీచరణి స్పిన్ బాధ్యతలు పంచుకోనుంది.
హర్మన్‌ప్రీత్(కెప్టెన్), మందన(వైస్ కెప్టెన్), ప్రతీక, హర్లిన్, దీప్తి, రోడ్రిగ్స్, రేణుక, అరుంధతి, రీచాఘోష్, క్రాంతిగౌడ్, అమన్‌జ్యోత్, రాధాయాదవ్, శ్రీచరణి, యస్తికా భాటియా, స్నేహ్‌రానా.