న్యూఢిల్లీ: అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్యాచ్‌లో మన జట్లు దుమ్మురేపాయి. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పురుషుల సెమీస్‌లో భారత్ 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
పాయింట్ల కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి టర్న్‌లో ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్పులెను దక్షిణాఫ్రికాన్లు సమర్థంగా నిలువరించగా, రెండో బ్యాచ్‌లో వచ్చిన అనికేత్ పోతె సఫారీలను రెండున్నర నిమిషాల పాటు అడ్డుకున్నాడు. రెండో టర్న్‌లో నిఖిల్, ఆదిత్య, గౌతమ్ రాణించడంతో భారత్ 24-20 ఆధిక్యం కనబరిచింది.
కీలకమైన మూడో టర్న్‌లో రామ్‌జీ కశ్యప్, పబనీ సబర్, సుయాశ్ రాణించడంతో టీమ్ఇండియా గెలుపు ఖరారైంది. మరోవైపు aమహిళల సెమీస్‌లో భారత్ 66-16తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో నేపాల్‌తో భారత్ తలపడుతుంది.