మాల్మో (స్వీడెన్): ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేసి అర్జున్ టెపె సిగెమెన్ అండ్ కో టోర్నీలో తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచి టై బ్రేక్‌లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు గట్టి పోటీ ఇచ్చిన అర్జున్ సడెన్ డెత్‌లో తడబడి రన్నరప్‌తో సరిపెట్టాడు. గురువారం జరిగిన టై బ్రేక్‌లో నార్వే స్టార్ మాగ్నస్ 2-1తో అర్జున్ను ఓడించి విజేతగా నిలిచాడు. అంతకుముందు ఆఖరి, ఏడో రౌండ్లో వుడ్వార్డ్తో గేమ్‌ను డ్రా చేసుకున్న అర్జున్ ఐదు పాయింట్లతో కార్ల్సన్తో సమానంగా నిలిచాడు. విన్నర్‌ను తేల్చేందుకు ఇద్దరి మధ్య టై బ్రేక్ నిర్వహించారు.
తొలి టై బ్రేక్‌లో తెల్లపావులతో ఆడి 46 ఎత్తుల తర్వాత ఓడిపోయిన అర్జున్.. రెండో గేమ్‌లో 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను ఓడించి స్కోరు సమం చేశాడు. కానీ, మూడో, సడెన్ డెత్ గేమ్‌లో తెల్లపావులతో ఆడినప్పటికీ కీలక సమయంలో తప్పిదాలు చేసిన అర్జున్.. 36 ఎత్తుల తర్వాత తలవంచడంతో కార్ల్‌సన్‌నే టైటిల్ వరించింది. తెలంగాణ కుర్రా డు ఈ టోర్నీలో టైటిల్ కోల్పోవడం ఇది రెండోసారి. 2024లో అర్జున్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.