కాకామిఘర: మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. జపాన్ వేదికగా జరుగుతున్న టోర్నీ తొలి పోరులో ఉజ్బెకిస్థాన్‌పై భారీ తేడాతో గెలిచిన భారత్.. సోమవారం 2-1తో మలేషియాను చిత్తుచేసింది. మన జట్టు తరఫున ముంతాజ్ ఖాన్ (10వ నిమిషంలో), దీపిక (26వ ని.లో) చెరో గోల్ చేయగా.. డియాన్ నజేరి (6వ ని.లో) మలేషియాకు ఏకైక గోల్ అందించింది. మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి ఆధిక్యం సాధించినా.. ఏమాత్రం ఒత్తిడికి గురి కాని మన అమ్మాయిలు డబుల్ గోల్స్‌తో సత్తాచాటారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ పూల్-‘ఎ’ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మంగళవారం జరుగనున్న తదుపరి పోరులో కొరియాతో మన అమ్మాయిలు తలపడనున్నారు.