బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఏ’తో ఆఖరి పోరులో భారత అమ్మాయిలు ఘోరంగా విఫలమయ్యారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ ‘ఏ’ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. అయితే తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ ‘ఏ’ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు ఒక వికెట్ కోల్పోయి 27.5 ఓవర్లలో 222 పరుగులు చేసింది.
ఓపెనర్, వికెట్ కీపర్ అలీస్సా హిలీ(85 బంతుల్లో 137 నాటౌట్, 23ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. పసలేని భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ తన ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 3 భారీ సిక్స్‌లతో విరుచుకుపడింది.
తహిలా విల్సన్(59)తో కలిసి తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించిన హిలీ..రాచెల్ తియాన్మెన్(21 నాటౌట్)తో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. రాధా యాదవ్‌కు ఏకైక వికెట్ దక్కింది. తొలుత షఫాలీ వర్మ(52), యస్తికా భాటియా(42) రాణించడంతో భారత్ ‘ఏ’ 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. మెక్‌గ్రాత్(3/40)కు మూడు వికెట్లు దక్కగా, జింగర్, హేవర్డ్, లీయార్డ్ రెండేసి వికెట్లు తీశారు.