Champions Trophy | కరాచీ: ఎడతెగని చర్చోపచర్చలు, దాయాది బోర్డుల పట్టువిడుపుల నడుమ ఎట్టకేలకు ‘హైబ్రిడ్ మోడల్’లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం! ఆదివారం ఈ టోర్నీ ఆరంభ వేడుకలలో భాగంగా కరాచీలోని నేషనల్ స్టేడియంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే దేశాలతో పాటు సభ్య దేశాల జాతీయ జెండాలను ఉంచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. మువ్వన్నెల భారత పతాకాన్ని మాత్రం పక్కనబెట్టింది.
భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతున్నా ప్రాతినిథ్య దేశం జెండాను ఎగురవేయడం ఆనవాయితీ. కానీ పాక్ మాత్రం భారత పతాకాన్ని ఎగురవేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి పీసీబీ తీరుపై టీమ్ఇండియా అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టు ఇక్కడికి రావడం లేదు. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్‌లు ఆడబోయే దేశాల జెండాలు మాత్రమే అక్కడ ఉన్నాయి’ అని తెలిపాడు.
అయితే భారత్‌తో పాటు బంగ్లాదేశ్ జెండా కూడా కరాచీలో కనిపించకపోవడంపై అతడే స్పందిస్తూ.. ‘బంగ్లాదేశ్ జట్టు ఇంకా పాకిస్థాన్‌కు రాలేదు. ఆ జట్టు తమ తొలి మ్యాచ్‌ను భారత్‌తో దుబాయ్‌లో ఆడుతుంది. అందుకే ఆ దేశ జెండాలను పాక్ స్టేడియాల్లో ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉండి ఇక్కడి స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడబోయే దేశాల జెండాలే ఇక్కడ ఉన్నాయి’ అని చెప్పడం గమనార్హం. దీనిపై పీసీబీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదని, కావాలనే పాకిస్థాన్ పరువును మంటగలిపే ప్రయత్నాలను కొందరు చేస్తున్నారని అతడు ఆరోపించాడు.