‘మన అమ్మాయిలు ప్రపంచకప్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం నుంచి చాలా సంస్థలు వారి ఎండార్స్మెంట్స్ కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. క్రికెటర్ల ప్రస్తుత బ్రాండ్ వాల్యూ.. ఇప్పుడు పెరిగిన విలువ కోసం చర్చలు సాగిస్తున్నాయి. చాలామంది మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ 25 నుంచి 30 శాతం దాకా పెరిగింది’ అని పలువురు క్రికెటర్ల ఎండార్స్‌మెంట్స్‌ను చూసే బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా తెలిపారు.
ముంబై: చారిత్రక వన్డే ప్రపంచకప్ విజయం మహిళా క్రికెటర్ల తలరాతను మార్చుతున్నది. దేశంలో మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చనున్న ఆ విజయం.. ప్రస్తుత జట్టుకు ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా మారింది. ఈ గెలుపుతో వారికి పేరు ప్రఖ్యాతులకు తోడు కాసుల వర్షమూ కురుస్తున్నది. ఇన్నాళ్లూ పురుష క్రికెటర్ల వెంటపడ్డ కంపెనీలు.. ఆదివారం అర్ధరాత్రి అమ్మాయిలు లిఖించిన నవ చరిత్రతో వారి కోసం క్యూ కడుతున్నాయి. ఒకే ఒక విజయంతో అమ్మాయిల బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సారథి హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ‘టీమ్ఇండియా బ్యాటింగ్ క్వీన్’ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షెఫాలీ వర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వంటి స్టార్ ప్లేయర్లు.. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేలా చూడాలని వారి వాణిజ్య వ్యవహారాలను చూసే ఏజెన్సీల తలుపు తడుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పైన పేర్కొన్న వారితో పాటు మిగతా ప్లేయర్ల ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్లు రెండు, మూడింతలు పెరిగారు. దీనికి తోడు బీసీసీఐ భారీ నజరానా (రూ. 51 కోట్లు), ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నగదు ప్రోత్సాహకాలతో అమ్మాయిల పంట పండనుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు 30 కోట్లు దాటడమూ వారికి కలిసొస్తున్నది.
ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (127*) ఆడిన జెమీమా.. ఒక్క మ్యాచ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ మ్యాచ్ తర్వాత జెమీమా బ్రాండ్ వ్యాల్యూ ఎకాఎకిన వందశాతానికి పెరిగిందని ఆమె వాణిజ్య వ్యవహారాలను చూసుకునే కరణ్ యాదవ్ (జేఎస్‌డబ్ల్యూలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) తెలిపాడు. ఆసీస్‌తో మ్యాచ్ ముగిశాక జెమీమా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని ఇప్పటికే 10-12 సంస్థలు క్యూ కట్టాయని ఆయన చెప్పాడు. జెమీమా ఇప్పటికే నైక్, ఎస్జీ అండ్ సర్ఫ్ ఎక్సెల్, బోట్, రెడ్ బుల్ వంటి సంస్థలకు ఎండార్స్ చేస్తున్నది. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు జెమీమా ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చార్జ్ చేసేది. ఇప్పుడది రెట్టింపైంది.
హర్మన్, జెమీమా, స్మృతి, దీప్తి, రిచా వంటి స్టార్లతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు తోడు మరికొన్ని బ్రాండ్స్ కూడా అమ్మాయిలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, లైఫ్‌ైస్టెల్, వెల్నెస్తో పాటు మొబైల్ ఉపకరణాల ఉత్పత్తులను తయారుచేసే సంస్థలు నారీమణులతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు లైన్లో ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లలో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా అందరికంటే ఎక్కువగా ఆదాయం గడిస్తున్నది మంధాననే. నైక్, హ్యుందాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వంటి 16 ఉత్పత్తులను ఆమె ప్రమోట్ చేస్తున్నది. ఒక్కో దానికి రూ. 1.5-2 కోట్ల వరకు తీసుకుంటున్నది. వరల్డ్ కప్‌లో స్థిరంగా రాణించిన ఆమె బ్రాండ్ వ్యాల్యూ కూడా సుమారు 30-40 శాతం పెరిగినట్టు తెలుస్తున్నది.

మహిళల జట్టుకు వరల్డ్ కప్ అందించిన తొలి భారత సారథిగా హర్మన్‌ప్రీత్.. చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇదివరకే పలు బ్రాండ్స్‌కు ఎండార్స్ చేస్తున్న ఆమె.. ప్రపంచకప్ విజయం తర్వాత ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారిపోయింది. వరల్డ్ కప్ గెలిచినవెంటనే పూమా, పెప్సీ వంటి మల్టీనేషనల్ కంపెనీలు కెప్టెన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికల్లో ఫస్ట్ పేజ్ యాడ్స్ కుమ్మరిస్తున్నాయి. ప్రపంచకప్‌నకు ముందు హర్మన్ ఒక్కో యాడ్‌కు రూ. 65-70 లక్షల వరకు తీసుకోగా ఇప్పుడా విలువ కోటిన్నర దాటిందని సమాచారం.