ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ పరిస్థితి సిరీస్ సిరీస్‌కూ దయనీయమవుతున్నది. గౌతీ హయాంలో ‘మెన్ ఇన్ బ్లూ’ మునుపెన్నడూ ఎదుర్కోని ఓటములను మూటగట్టుకుంటున్న నేపథ్యంలో అభిమానుల్లో అతడిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గంభీర్ రావడానికి ముందు స్వదేశలో తిరుగులేని శక్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ విదేశాల్లోనూ సంచలన విజయాలు సాధించిన భారత జట్టు వైభవం క్రమంగా మసకబారడమే గాక రోజురోజుకూ మరింత దిగజారుతున్నది. విదేశాల సంగతి పక్కనబెడితే కనీసం సొంతగడ్డపైనా సిరీస్‌లను కాపాడుకోలేని దుస్థితిలో టీమ్ఇండియా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఎవరెన్ని చెప్పినా ఈ ఓటములన్నింటికీ సమాధానం వెతకాల్సి వస్తే అన్ని వేళ్లూ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. 15 నెలల క్రితం.. గంభీర్ భారత హెడ్‌కోచ్ పగ్గాలు చేపట్టాక ఆతిథ్య జట్టును టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్, తాజాగా వన్డేల్లోనూ మట్టికరిపించడంతో గంభీర్ ఇకనైనా తప్పుకుంటే మంచిదని అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని టార్గెట్ చేస్తూ ‘మీ సేవలిక చాలు.. జట్టును ఇంకా దిగజార్చొద్దు. దిగిపోండి మహాప్రభో’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇక మాజీ క్రికెటర్లు, క్రీడా పండితుల విమర్శలైతే సరేసరి!
టెస్టుల్లో అశ్విన్, కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్, షమీ జట్టులో చోటు కోల్పోవడం వంటి కారణాలతో భారత జట్టు బలహీనపడిందనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ప్రస్తుతం సంధి దశలో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. నిరుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను మినహాయిస్తే బోర్డర్, గవాస్కర్ ట్రోఫీని 1-4తో కోల్పోవడం, కొద్దిరోజుల క్రితమే దక్షిణాఫ్రికాతోనూ వైట్‌వాష్‌కు గురవడంతో గంభీర్‌పై అభిమానుల్లో ఆగ్రహజ్వాల రేగింది. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత అతడిని హెడ్‌కోచ్‌గా తప్పియ్యాలన్న డిమాండ్ ఊపందుకోగా తాజాగా కివీస్‌తో వన్డే సిరీస్ ఓటమితో గంభీర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది.
సంధి దశలో ఉన్న భారత జట్టు టెస్టుల్లో ప్రదర్శన ఎలా ఉన్నా ఇంకా వన్డేల్లో ఆడుతున్న రోహిత్, కోహ్లీ, ఇతర సీనియర్లతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత ప్రదర్శన మెరుగ్గానే ఉంది. టీ20ల్లోనూ భారత్ నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్నది. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ మాత్రం వన్డేల్లో పడిపోతున్న భారత జట్టు ప్రదర్శనకు నిలువుటద్దం అని చెప్పకతప్పదు. టెస్టుల్లో మాదిరిగానే ఈ సిరీస్‌లో గంభీర్ సెలక్షన్ నిర్ణయాలు, అమలుచేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతీశాయి.
సొంతగడ్డపై భారత ప్రధాన ఆయుధమైన స్పిన్ విభాగంలో కుల్దీప్, జడేజా దారుణంగా తేలిపోయినా వారిని రిప్లేస్ చేయడంలో గంభీర్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్, మిచెల్ శాంట్నర్, టామ్ లాథమ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి ఆటగాళ్లతో వచ్చినా టీమ్ఇండియా వారిపై ఓడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సిరీస్ ఓడగానే ‘గంభీర్ గో బ్యాక్’ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అయింది.
వన్డే సిరీస్ ఓటమి గంభీర్‌కు మరింత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. జట్టు ప్రదర్శనపై అతడు ఎంత సమర్థించుకున్నా గణాంకాలు మాత్రం గౌతీ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆ ప్రతిష్టాత్మక టోర్నీలో నిలిచి గెలిస్తేనే గంభీర్ కోచ్‌గా కొనసాగే అవకాశముంటుంది. ఆ టోర్నీలో ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా అతడు బీసీసీఐ ఆగ్రహానికి గురవ్వక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.