‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స్ అన్న మాటలివి. ఆ టెస్టులో నాలుగు రోజులు టీమిండియాదే ఆధిపత్యం. కానీ నాలుగో ఇన్నింగ్స్ లో భారత్ పట్టు జారవిడవడంతో ఇంగ్లండ్ కు విజయం దక్కింది. ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ లోనూ ఇండియాకు తిప్పలు తప్పవన్నారు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్. కానీ రెండు వారాల్లో ఫలితం తారుమారు.
రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడినా టీమిండియా బెదరలేదు. టీ20లలో రోహిత్ శర్మ రాకతో బలం పుంజుకున్న భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు గెలిచి ఇంగ్లండ్ కు షాకిచ్చింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. చివరి టీ20లో ఓడినా అందులో కూడా అతిథ్యజట్టుకు వణుకు పుట్టించింది. రెండు టీ20లలో భారత జట్టు బౌలింగ్ ఇంగ్లండ్ ను బెంబేలెత్తించింది.
ఇక వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ ప్రధాన ఆటగాళ్లైన జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ వంటివాళ్లు తుదిజట్టుతో కలవడంతో ఆ జట్టు బలం రెట్టింపైంది. టీమిండియాతో సిరీస్ కు ముందు ఇంగ్లండ్ బలహీన ప్రత్యర్థి నెదర్లాండ్స్ మీద వన్డేలలో అత్యధిక భారీ స్కోరు (498-4) నమోదు చేసింది. ఈ సిరీస్ లో కూడా అదే సీన్ రిపీట్ చేస్తామని.. తాము కొత్తగా అలవరుచుకున్న విధానం (బ్యాజ్ బాల్) తో టీమిండియా కు వన్డేలలో చుక్కలు చూపిస్తామని విర్రవీగారు బ్రిటీష్ అభిమానులు.
కట్ చేస్తే.. ‘ది ఓవల్’లో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు భారత్ పై తన అత్యల్ప స్కోరు (110) కు ఆలౌటై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. తొలివన్డేలో భారత పేసర్ల ధాటికి రాయ్, బెయిర్ స్టో, జో రూట్, స్టోక్స్, కెప్టెన్ జోస్ బట్లర్, లివింగ్ స్టోన్ లు కలిసి చేసిన పరుగులు 37. వీళ్లలో బట్లర్ (30), బెయిర్ స్టో (7) తప్ప అంతా డకౌటే. రెండో వన్డేలో పైన పేర్కొన్నవారంతా చేసింది 130 పరుగులే. మూడో వన్డేలో బట్లర్ (60), రాయ్ (41) తప్ప అంతా విఫలం.
అదే ముంచిందా..?
దూకుడే తమ మంత్రమని.. టెస్టులను కూడా టీ20ల మాదిరిగా దూకుడుగా ఆడతామని బీరాలు పలికిన ఇంగ్లండ్.. అన్ని రోగాలకు ఒకటే మందు అన్న పద్దతిలో ఆడింది. దూకుడుగా ఆడే విధానానికి తాము పెట్టుకున్న ‘బ్యాజ్ బాల్’ అన్ని సార్లు పనికిరాదని ఇంగ్లండ్ ఆటగాళ్లకు రెండు వరుస సిరీస్ లు ఓడినా అనుభవంలోకి వచ్చినట్టు లేదు. వచ్చిఉంటే టీ20లు ఓడినా వన్డేలలో ఆ ఆటతీరు ఆడకపోయి ఉండేవారు. ఈ మూడు వన్డేలలో జేసన్ రాయ్ నుంచి లివింగ్ స్టోన్ వరకు అంతా దూకుడుగా ఆడాలనే తాపత్రయమే తప్ప కడదాకా క్రీజులో నిలుద్దామన్న ఆలోచనా విధానం ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు.
తక్కువగా అంచనా వేసి..
రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియా ఓడగానే ఇంగ్లండ్.. పర్యాటక జట్టును తక్కువంచనా వేసింది. టీ20లలో ఇంగ్లండ్ దుర్బేధ్యమైన జట్టు. కానీ వరుసగా రెండు మ్యాచులలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. బ్యాటర్లతో పాటు బౌలింగ్ లో కూడా భువనేశ్వర్, అర్ష్దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ లో ఇంగ్లండ్ ను ముప్పుతిప్పలుపెట్టారు. రెండో టీ20 లో కూడా ఇంగ్లండ్ అదే తరహా ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్ పిచ్ లపై భారత బౌలర్లు ఈ విధంగా చెలరేగుతారని ఆ జట్టు కూడా ఊహించి ఉండదు.
మొత్తానికి ఈ రెండు సిరీస్ ల ద్వారా ఇంగ్లండ్ కు టీమిండియా భారీ షాకులిచ్చిందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఆతిథ్య జట్టుకు వరుస సిరీస్ ఓటములతో సోషల్ మీడియాలో ఇండియా ఫ్యాన్స్ (భారత్ ఆర్మీ) కూడా ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల గ్రూప్ (బర్మీ ఆర్మీ)కు కౌంటర్లు వేస్తున్నారు. ‘ఇండియాతో ఆడటమంటే నెదర్లాండ్, ఐర్లాండ్ తో ఆడినట్టు కాదు అని గుర్తుంచుకోండి’ అని చురకలంటిస్తున్నారు. ఇండియాతో సిరీస్ ముగిసిన తరుణంలో ఇంగ్లండ్.. రేపటి (జులై 19) నుంచి దక్షిణాఫ్రికాతో మూడువన్డేల సిరీస్ ఆడనుంది.