పెర్త్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir).. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఆకస్మికంగా స్వదేశానికి బయలుదేరారు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఆయన ఇండియాకు రిటర్న్ అయ్యారు. అత్యవసరమైన వ్యక్తిగత కారణాలతో గంభీర్.. స్వదేశానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్‌లో జరగనున్న రెండవ టెస్టుకు ముందు.. మళ్లీ గంభీర్ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడైంది. నవంబర్ 30 నుంచి కేన్బెరాలో జరగనున్న వార్మప్ మ్యాచ్‌కు దూరం కానున్నారు.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా నేతృత్వంలోని ఇండియన్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆ జట్టు పెర్త్ నుంచి కేన్బెరా బయలుదేరుతుంది. అక్కడ ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఇచ్చే ప్రత్యక విందులో భారత జట్టు క్రికెటర్లు పాల్గొంటారు. ఇక రెండవ టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ గేమ్ కావడంతో.. భారత జట్టు ఆ మ్యాచ్ కన్నా ముందే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనున్నది. రెండో టెస్టు కోసం పింక్ కలర్ కోకాబురా బంతిని వాడనున్నారు.
ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు భారత్ సిద్దమైంది. ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టుకు జాక్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆ జట్టు పూర్తిగా యువకులతో నిండి ఉన్నది. స్కాట్ బోలాండ్, మాథ్యూ రెన్షా కూడా ఆ జట్టులో ఉన్నారు. అనధికార మ్యాచ్ కావడం వల్ల.. రెండు జట్లూ బ్యాటింగ్, బౌలింగ్ చేసే రీతిలో ప్రాక్టీస్ గేమ్ కొనసాగనున్నది.