న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్(Guatam Gambhir) సీరియస్ అయ్యారు. మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టూరు కోసం వన్డే జట్టుకు బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసిన అంశాన్ని గంభీర్ సమర్థించారు. అయితే గంభీర్ కోసం ఎప్పుడూ తల ఊపే హర్షిత్ రాణాను ఆసీస్ టూరుకు ఎంపిక చేశారని శ్రీకాంత్ ఇటీవల విమర్శించారు. తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ ఆ వ్యాఖ్యలు చేశారు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఇవాళ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది చాలా సిగ్గు చేటు అని, మీ స్వంత యూట్యూబ్ ఛానల్ కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను విమర్శిస్తారా, ఇది చాలా అన్యాయం అని గంభీర్ అన్నారు. మెరిట్ ఆధారంగానే హర్షిత్ రాణా జాతీయ జట్టుకు ఎంపికైనట్లు గంభీర్ చెప్పారు. ఆ క్రికెటర్ తండ్రి సెలెక్షన్ కమిటీలో లేరని, మాజీ క్రికెటర్ కాదని, ఎన్ఆర్ఐ కూడా కాదని తెలిపారు. తన సత్తాపై హర్షిత్ క్రికెట్ ఆడుతున్నాడని, అలాగే కొనసాగుతాడని, వ్యక్తులను టార్గెట్ చేయడం సమంజసం కాదు అని భారత కోచ్ పేర్కొన్నారు.
హర్షిత్ రాణా 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడని, ఒకవేళ అది సరిపోదనుకుంటే, అప్పుడు సెలెక్షన్ కమిటీ అతన్ని తొలగిస్తుందన్నారు. పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆటగాళ్లను టార్గెట్ చేయాలని, ఆ జాబ్ చేసేందుకే సెలెక్టర్లు ఉన్నారని, సోషల్ మీడియాలో 23 ఏళ్ల వ్యక్తి గురించి అనుచితంగా మాట్లాడితే, అది అతని మైండ్‌సెట్‌ను ఎలా దెబ్బతీస్తుందో ఆలోచించరా అని గంభీర్ అన్నారు. అయితే హర్షిత్ రాణా, గంభీర్ మధ్య ఐపీఎల్ అనుబంధం ఉన్నట్లు శ్రీకాంత్ ఆరోపించారు. ఆ ఇద్దరూ కోల్‌కతా జట్టుకు ఆడినట్లు మాజీ క్రికెటర్ పేర్కొన్నారు. ఆ కారణంగానే హర్షిత్‌ను ఆస్ట్రేలియా టూరుకు సెలెక్ట్ చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానున్నది.