దుబాయ్: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు కీలక సన్నాహానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఇక్కడ జరుగనున్న ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటి విశ్వక్రీడల కోసం సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా చాలా టోర్నీలు రద్దుకాగా ఒలింపిక్స్‌కు ముందు వచ్చిన ఈ పోటీలో తమను తాము పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న 9 మంది సహా మొత్తం భారత్ తరఫున 19 మంది బాక్సర్లు (9 మంది పురుషులు, 10 మంది మహిళలు) ఆసియా పోరులో బరిలోకి దిగుతున్నారు. విశ్వక్రీడలకు అర్హత సాధించిన అమిత్ పంగాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), వికాస్ కృష్ణన్ (69 కేజీలు) పురుషుల పోటీలో ఫేవరెట్లుగా ఉన్నారు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఆసియా విజేత మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బోర్గహెయిన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. నాలుగుసార్లు ఆసియా పోటీల్లో పతకాలు సాధించిన శివ థాపా (64 కేజీలు), తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు)పై కూడా అందరి దృష్టి ఉండనుంది. కాగా కరోనా నేపథ్యంలో అనుమతుల్లో సందిగ్ధత కారణంగా గంటపాటు గాల్లో విమానం చక్కర్లు కొట్టాక దుబాయ్‌లో శనివారం మనవాళ్లు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలుత షెడ్యూల్ ప్రకారం భారత్‌లో జరుగాల్సిన ఈ టోర్నీ వైరస్ ప్రభావం వల్ల దుబాయ్‌కు మారింది.
ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత బాక్సర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 13 పతకాలతో 2019లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మనవాళ్లు.. ఈసారి ఆ రికార్డు బద్దలుకొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ టోర్నీలో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ భారత్ నుంచి తొలి బౌట్లో బరిలోకి దిగనున్నాడు. భారత్‌తో పాటు ఇండోనేషియా, ఇరాన్, కజకిస్థాన్, దక్షిణకొరియా, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్థాన్ ఈ టోర్నీలో ప్రధానమైన జట్లుగా ఉన్నాయి. సాకెన్ బిబోసినోవ్, అబ్లయ్ఖాన్ జుసుపోవ్, నాజిమ్ కిజైబే, డినా జొలామన్తో కూడిన కజకిస్థాన్ బృందం కూడా పటిష్టంగా ఉంది.
పురుషులు: అమిత్ పంగాల్ (52 కేజీలు), మహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు), శివ థాపా (64 కేజీలు), వికాస్ కృష్ణన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సంజీత్ (91 కేజీలు), నరీందర్ (+ 91 కేజీలు)
మహిళలు: మేరీకోమ్ (51 కేజీలు), మోనిక (48 కేజీలు), సాక్షి (54 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లాల్బుస్తాహి (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజారాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), అనుపమ (+ 81 కేజీలు)